ఆస్కార్ రేసులో 'హోమ్‌బౌండ్'.. నామినేషన్‌కు అడుగు దూరంలో భారతీయ చిత్రం

  • 98వ ఆస్కార్ అవార్డుల షార్ట్‌లిస్ట్‌లో 'హోమ్‌బౌండ్'
  • ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాప్ 15లో చోటు
  • భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన చిత్రం
  • ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రధారులుగా మూవీ
  • ఈ నెల‌ 22న ఆస్కార్ తుది నామినేషన్ల ప్రకటన
ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల రేసులో భారతీయ చిత్రం 'హోమ్‌బౌండ్' మరో ముందడుగు వేసింది. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ఈ సినిమా.. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాప్ 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. దీంతో తుది నామినేషన్ సాధించడానికి 'హోమ్‌బౌండ్' కేవలం అడుగు దూరంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ‌ దేశాల నుంచి వచ్చిన సినిమాలను పరిశీలించిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), తదుపరి రౌండ్ ఓటింగ్‌ కోసం 15 చిత్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ నుంచి 'ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జపాన్ నుంచి 'కొకుహో', దక్షిణ కొరియాకు చెందిన 'నో అదర్ ఛాయిస్' వంటి చిత్రాలతో పాటు 'హోమ్‌బౌండ్' పోటీ పడుతోంది. రెండో రౌండ్ ఓటింగ్ తర్వాత తుది నామినేషన్లను ఈ నెల‌ 22న అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15న లాస్‌ ఏంజిలెస్‌లో అవార్డుల ప్ర‌దానోత్సవం జరగనుంది.

నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన 'హోమ్‌బౌండ్' గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. లాక్‌డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరు స్నేహితుల మధ్య బంధాన్ని, వారి కుటుంబాల్లోని సంఘ‌ర్ష‌ణ‌లను ఈ చిత్రం ఆవిష్కరించింది.


More Telugu News