Soumya: ప్రియుడి మోజులో భర్తను చంపేసి నాటకం... నిజామాబాద్ జిల్లాలో దారుణం!

Soumya arrested for husbands murder in Nizamabad
  • నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామంలో ఘటన
  • ప్రియుడు దిలీప్‌‌తో కలిసి భర్త రమేశ్‌ను హత్య చేసిన సౌమ్య 
  • హార్ట్ అటాక్‌తో మృతి చెందాడంటూ హాడావుడిగా అంత్యక్రియలు
  • మృతుని సోదరుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన హత్యోదంతం  
ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి, గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాంలో చోటుచేసుకోగా, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసి చివరకు కటకటాల పాలైంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పట్టాటి రమేశ్ (35) భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం భర్త రమేశ్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని సౌమ్య నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేశ్‌ను ఇంట్లోనే టవల్‌తో ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించింది.

అయితే అంత్యక్రియల సమయంలో రమేశ్‌ మెడపై గాట్లు కనిపించడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించారు. కేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు సౌమ్య ఒప్పుకున్నట్టు తెలిపారు.

ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పదమూడు సంవత్సరాల వైవాహిక బంధం, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను హత్య చేసిన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 
Soumya
Nizamabad crime
murder for affair
extra marital affair murder
private school teacher
lover kills husband
Borgam murder case
crime news Telangana
husband murdered
Telangana news

More Telugu News