Hyderabad man: క్రూయిజ్ ట్రిప్ పేరుతో హైదరాబాద్ వ్యక్తికి రూ.2.42 లక్షల కుచ్చుటోపీ

Hyderabad Man Loses Rs 242 Lakh in Cruise Trip Fraud
  • గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వెబ్ సైట్ ద్వారా క్రూయిజ్ ట్రిప్ బుక్ చేసిన బాధితుడు
  • పలు దఫాలుగా రూ.2.42 లక్షలు చెల్లించిన బాధితుడు 
  • మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
క్రూయిజ్ ట్రిప్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ.2.42 లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. పలు దఫాల్లో లక్షల రూపాయలు చెల్లించిన బాధితుడు, చివరకు తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాచిగూడకు చెందిన ఒక వ్యక్తి గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 26న కొచ్చి-లక్షద్వీప్-ముంబై క్రూయిజ్ ట్రిప్ బుక్ చేసుకున్నాడు. నాలుగు టిక్కెట్లు తీసుకున్న అతను ముందస్తు అడ్వాన్సుగా రూ.23,680 చెల్లించాడు. ఒకేసారి అంతమొత్తం ట్రాన్స్ ఫర్ అవకపోవడంతో పలు దఫాల్లో చెల్లింపులు జరపాలని అవతలి వ్యక్తి సూచించాడు.

లక్షద్వీప్ పర్మిట్ ఛార్జీలు, పిల్లల ఛార్జీలు, సాంకేతిక కారణాలు ఇలా పలు కారణాలు చెప్పి పలుమార్లు అవతలి వ్యక్తి పేమెంట్ చేయించాడు. బుకింగ్ క్యాన్సిల్ కింద కూడా రూ.48,500 కట్టాలని డిమాండ్ చేశాడు. మొత్తం రూ.2.42 లక్షలు బాధితుడు చెల్లించాడు. అదనంగా కట్టిన మొత్తాన్ని రిఫండ్ చేస్తామని అవతలి వ్యక్తి నమ్మించే ప్రయత్నం చేశాడు.

కానీ అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిధిగా ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా తనను సంప్రదించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ ఒక అడ్వైజరీని జారీ చేశారు. పర్యాటక ప్యాకేజీలను అధికారిక వెబ్‌సైట్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల ద్వారానే బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. గూగుల్ సెర్చ్ లేదా అడ్వర్టైజ్‌మెంట్లలో కనిపించే సైట్లను నమ్మి పేమెంట్లు చేయవద్దని సూచించారు. సాంకేతిక సమస్యలు, పేమెంట్ ఫెయిల్యూర్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే అనుమానించాల్సిన విషయమేనని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లలో ఉండే కస్టమర్ కేర్ నెంబర్లనే విశ్వసించాలని సూచించారు. వాట్సాప్‌లో సంప్రదించే వారిని విశ్వసించవద్దని తెలిపారు.
Hyderabad man
Cruise trip fraud
Cyber crime
Lakshadweep
Kochi
Mumbai cruise
Online fraud

More Telugu News