Malavika Mohanan: స్విమ్మింగ్ పూల్‌లో మూడు రోజులు షూటింగ్ చేశారు: మాళవిక మోహనన్
- ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రంలో కథానాయికగా మాళవిక మోహనన్
- ప్రభాస్‌తో తనకు చాలా సన్నివేశాలు ఉన్నాయని వెల్లడి
- సీన్స్ బాగా రావాలంటే కెమిస్ట్రీ బాగుండాలని వ్యాఖ్య
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన 'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా ఈ నెల 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హారర్ ఫాంటసీ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, ప్రోమోలు ఇప్పటికే అంచనాలను భారీగా పెంచాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కనిపించనున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో ఉన్నారు. తమన్ సంగీతాన్ని అందించారు.
తాజాగా హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. "నటీనటుల మధ్య సీన్స్ బాగా రావాలంటే కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ప్రభాస్‌తో నాకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. నా పాత్రకు నిడివి ఎక్కువ ఉంది. నా సోలో సీన్‌ను పెద్ద స్విమ్మింగ్ పూల్‌లో మూడు రోజులు షూట్ చేశారు. రోజుకు దాదాపు 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది. మొసలి దాడి చేస్తున్నట్లు నటించాలి. ఒకవైపు చలికి చర్మం మొత్తం మొద్దుబారిపోతోంది. మరోవైపు భయం, ఆందోళన కలిసిన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. పెయింట్, కెమికల్స్, వాడిపారేసిన వస్తువులు అన్నీ కలిసి ఉన్నాయి. అందులో మూడు రోజులు గడపడం ఒక వింత అనుభవం" అంటూ మాళవికా గుర్తు చేసుకున్నారు.