Nara Lokesh: వీసీలు కేవలం పరిపాలన అధిపతులు కాదు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Calls for Education Reforms at VC Meeting
  • వీసీలు సంస్కరణల రాయబారులుగా పనిచేయాలన్న లోకేశ్
  • జ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని వెల్లడి
  • పాఠ్యాంశాలు, పరిశ్రమల అవసరాల మధ్య అంతరం తగ్గాలని వ్యాఖ్యలు
  • బోధన, ఉపాధి, పరిశోధనలపై వీసీలకు 5 కీలక సూచనలు
 వైస్ ఛాన్సలర్లు (వీసీలు) కేవలం పరిపాలన అధిపతులుగా మిగిలిపోకూడదని, విద్యారంగాన్ని నడిపించే నాయకులుగా, సంస్కరణల రాయబారులుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో విశ్వవిద్యాలయాల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల సమీక్షా సమావేశంలో లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తన పాదయాత్రలో ఎంతో మంది యువతను కలిశానని, సర్టిఫికెట్లు చేతిలో ఉన్నా ఉద్యోగాలు లేక గందరగోళంలో ఉన్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యలో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలని వీసీలకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్‌లు పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని సూచించారు.

"డిగ్రీలు పూర్తిచేసినా ఉద్యోగం రాక మన విద్యార్థులు అమీర్‌పేటలో శిక్షణ పొందితే కానీ ఉద్యోగం సాధించలేకపోతున్నారు. ఇది విద్యార్థుల వైఫల్యం కాదు, మన సంస్థల వైఫల్యం" అని మంత్రి లోకేశ్ అన్నారు. పరిశోధనలు కేవలం ప్రచురణలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రతి వారం విద్యార్థులతో నేరుగా మాట్లాడేందుకు 'ఓపెన్ హౌస్' నిర్వహించాలని వీసీలను కోరారు. అందరి కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయి సంస్థలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

ఉన్నత విద్యలో 5 సవాళ్లు

ప్రస్తుతం ఉన్నత విద్యారంగం ఐదు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి లోకేశ్ విశ్లేషించారు.
1. బోధన-అవసరాల మధ్య అంతరం: పరిశ్రమల అవసరాలకు, మనం బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. దీనివల్ల మన డిగ్రీలకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతోంది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ సైతం ఎప్పటికప్పుడు తమ పాఠ్యాంశాలను పూర్తిగా మారుస్తోందని, మనం కూడా కాలానుగుణంగా సిలబస్‌ను నవీకరించాలని సూచించారు.

2. ఉద్యోగావకాశాలు లేని డిగ్రీలు: ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో మన డిగ్రీలకు విశ్వసనీయత కొరవడుతోంది. మన వర్సిటీల నుంచి పట్టభద్రులైన విద్యార్థులు ఉద్యోగాలు సాధించలేకపోతుండగా, అమీర్‌పేటలో నాలుగు నెలల శిక్షణతో ఉద్యోగాలు పొందుతున్నారని, ఇది విద్యార్థుల వైఫల్యం కాదని, మన విద్యాసంస్థల వైఫల్యమని స్పష్టం చేశారు.

3. ప్రయోజనం లేని పరిశోధనలు: పరిశోధనలు కేవలం ప్రచురణలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మారాలి. నీటికొరత, వాతావరణ మార్పులు వంటి సమస్యలకు వర్సిటీలు పరిష్కారాలు చూపాలి.

4. పరిపాలనా భారం: అధ్యాపకులు, వీసీలు బోధన కంటే పరిపాలనపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఈ పాత పద్ధతులు వీడి, అకడమిక్ ప్రమాణాలపై దృష్టి సారించాలి.

5. విద్యార్థుల అనుభవంలో లోపాలు: విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, మానసిక మద్దతు కొరవడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

భవిష్యత్ కార్యాచరణ ఇదే

ఈ సవాళ్లను అధిగమించేందుకు పాత పద్ధతులను విడనాడి, విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. రాబోయే పదేళ్లలో రానున్న ఉద్యోగాల్లో 80 శాతం ఇప్పటికి తెలియని రంగాల్లోనే ఉంటాయని, అందుకు తగ్గట్టుగా యువతను సిద్ధం చేయాలన్నారు. పరిశ్రమలతో అనుసంధానం పెంచి, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లను తప్పనిసరి చేయాలన్నారు. వర్సిటీలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను వినియోగించుకోవాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇందుకు చక్కటి ఉదాహరణ అని తెలిపారు.

ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డీ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.
Nara Lokesh
AP Higher Education
Vice Chancellors Meeting
Andhra Pradesh Universities
Skill Development
Internships
Placements
Education Reforms
Abdul Nazeer
Kona Sasidhar

More Telugu News