Chandrababu Naidu: కోనసీమలో ఓఎన్జీసీ సైట్ వద్ద భారీ అగ్నిప్రమాదం... మంత్రులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu alerts ministers after major fire at ONGC site in Konaseema
  • కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్
  • మరమ్మతు పనుల సమయంలో భారీగా ఎగిసిపడిన మంటలు
  • రెండు గంటల పాటు కొనసాగిన లీకేజీతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన
  • పరిస్థితి అదుపులోకి తెచ్చిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం
కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్‌లో భారీ గ్యాస్ లీకేజీ జరిగి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓఎన్జీసీకి చెందిన మోరీ-5 బావి వద్ద ఉన్న గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి చిమ్మడంతో మంటలు వ్యాపించాయి. దాదాపు రెండు గంటల పాటు పెద్ద శబ్దాలతో గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు అంటుకొని, 500కు పైగా చెట్లు కాలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సీఎం ఆదేశించారు. మంటలను త్వరితగతిన అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా, ఉత్పత్తిని పెంచే పనుల్లో భాగంగానే ఈ లీకేజీ జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Chandrababu Naidu
Konaseema fire accident
ONGC fire accident
Andhra Pradesh gas leak
Irusumanda village
Acham Naidu
Nimmala Ramanaidu
Gas pipeline explosion
Konaseema district
ONGC drilling site

More Telugu News