Satya Nadella: వృత్తి జీవితానికి 'ఏఐ' హానికరమని మాట్లాడటాన్ని ఆపేయాలి: సత్య నాదెళ్ల

Satya Nadella Stop Talking About AI Being Harmful to Careers
  • కృత్రిమ మేధలో భారీ మార్పులు వస్తాయన్న సత్య నాదెళ్ల
  • మానవ సామర్థ్యాలను పెంచడానికి ఏఐ ఒక టూల్‌గా ఉంటుందన్న సత్య నాదెళ్ల
  • ఏఐ పరిశ్రమ కొత్తదనం నుంచి మరిన్ని సవాళ్ల సమయంలోకి అడుగు పెట్టిందని వ్యాఖ్య
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) కారణంగా వృత్తి జీవితానికి హానికలుగుతుందనే వాదనలను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. 'లుకింగ్ ఎహెడ్ 2026' పేరిట ఆయన తన బ్లాగ్‌లో పలు అంశాలను పంచుకున్నారు. కృత్రిమ మేధలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతికతకు సంబంధించి, ప్రతి ఒక్కరూ కొత్తదనపు దశను అధిగమించి, వాస్తవ ప్రపంచంపై దాని ప్రభావం పట్ల దృష్టి సారించాలని సూచించారు.

మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని, ఇది మానవులకు ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఉత్పత్తి రూపకల్పన, సామాజిక అంశాల ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన అన్నారు. ఏఐ పరిశ్రమ కొత్తదనపు దశ నుంచి సవాళ్లతో కూడిన సమయంలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా వేలాది కంపెనీలకు సేవలందించిన ఆఫీస్, విండోస్ సాఫ్ట్‌వేర్ స్థానంలో ఏఐ ఏజెంట్లను వినియోగించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని ఆయన తెలిపారు.

ఏఐను స్వతంత్ర మేధస్సుగా పరిగణించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ ఆలోచనలను మెరుగుపరిచే, ప్రజల లక్ష్యాల సాధనకు తోడ్పడే ఒక సాధనంగా దీనిని చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఏఐని ఏ విధంగా వినియోగిస్తారనే దానిపై ఈ సాంకేతికత వినియోగం ఆధారపడి ఉంటుందని తెలిపారు. కోపైలట్, అనుబంధ ఉత్పత్తులను బలోపేతం చేయడానికి, మరింత ఆధునిక ఏఐ నమూనాలపై మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతోందని ఆయన వెల్లడించారు.
Satya Nadella
Microsoft
Artificial Intelligence
AI
Looking Ahead 2026
Copilot
AI models

More Telugu News