Telangana Jobs: తెలంగాణ‌లో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యశాఖలో త్వరలోనే 850 పోస్టుల భర్తీ

Telangana government approves 850 job postings In NIMS Hyderabad
  • పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • కొత్తగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలుకు నిర్ణయం
  • నిమ్స్‌లో 125 వెంటిలేటర్లు.. ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాల భర్తీ
  • అంబులెన్స్ రెస్పాన్స్ టైమ్‌ను 10 నిమిషాలకు తగ్గించేందుకు చర్యలు
  • బస్తీ దవాఖానాలకు నేరుగా మందుల సరఫరా చేసేలా కొత్త విధానం
తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను సమూలంగా బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యున్నత వైద్య సేవలందించే నిమ్స్ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. నిమ్స్‌లో అదనంగా 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సభకు హామీ ఇచ్చారు.

శాసనసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,790 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటిని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎంతో పాటు జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 

అలాగే, రోగ నిర్ధారణలో కీలకమైన 9 కొత్త ఎంఆర్‌ఐ యంత్రాలను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పేదలకు ఖరీదైన పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.

10 నిమిషాల్లోనే అంబులెన్స్.. వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు
అత్యవసర సేవలపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని, కొత్త అంబులెన్స్‌ల రాకతో రెస్పాన్స్ సమయం 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది మరో 79 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టి ఈ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 

డయాలసిస్ రోగుల కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకపై బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేకుండా నేరుగా సెంట్రల్ స్టోర్స్ నుంచి సరఫరా చేసేలా కొత్త విధానం తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Telangana Jobs
Damodar Rajanarasimha
Telangana government jobs
NIMS Hyderabad
government hospitals
free medical services
ambulance services
health sector Telangana
Telangana health minister
MRI machines

More Telugu News