Mohammed Shami: బెంగాల్‌లో ఓటర్ల సవరణ... క్రికెటర్ మహ్మద్ షమీకి నోటీసులు

Mohammed Shami Receives Notice on Bengal Voter List Updates
  • పశ్చిమ బెంగాల్‌లో పలువురు ప్రముఖులకు ఈసీ సమన్లు
  • తృణమూల్ ఎంపీ దేవ్, క్రికెటర్ మహ్మద్ షమీకి నోటీసులు
  • ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల ప్రక్రియలో భాగంగా హియరింగ్
  • ఇది అనవసర వేధింపు అని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్
  • విజయ్ హజారే ట్రోఫీ కారణంగా షమీ హియరింగ్‌కు దూరం
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల (SIR) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు దేవ్ (దీపక్ అధికారి), భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కూడా హియరింగ్‌కు హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం వేధించే చర్యేనని ఆరోపించింది.

వివరాల్లోకి వెళితే.. ఎంపీ దేవ్‌తో పాటు ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు కూడా ఈసీ నోటీసులు పంపింది. ఘటల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన దేవ్, ప్రస్తుతం కోల్‌కతాలోని సౌత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఈసీ నోటీసులపై దేవ్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

మరోవైపు, భారత పేసర్ మహ్మద్ షమీకి కూడా ఓటరు జాబితాలోని కొన్ని సమస్యల కారణంగా హియరింగ్ నోటీసు అందింది. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా చాలాకాలంగా కోల్‌కతాలోనే నివసిస్తున్నాడు. జాదవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదయ్యాడు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నందున, సోమవారం జరగాల్సిన హియరింగ్‌కు షమీ హాజరుకాలేకపోయాడు. టోర్నీ ముగిశాక హాజరవుతాడని తెలిసింది. షమీ సోదరుడికి కూడా నోటీసులు అందినట్టు సమాచారం.

గతంలో నటుడు అనిర్బన్ భట్టాచార్యకు, నటుల దంపతులు కౌశిక్ బెనర్జీ, లాబోని సర్కార్‌లకు కూడా ఇలాంటి నోటీసులే అందాయి. సోమవారం హియరింగ్‌కు హాజరైన లాబోని సర్కార్, "వారు కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకుని పంపించారు" అని మీడియాతో అన్నారు. అయితే, బిజీగా ఉండే నటీనటులను, ప్రముఖులను ఇలా పిలిపించడం అనవసర వేధింపులకు గురిచేయడమేనని స్థానిక తృణమూల్ కౌన్సిలర్ మౌసమి దాస్ ఆరోపించారు.
Mohammed Shami
Mohammad Shami voter ID
West Bengal voter list
Dev TMC MP
Voter list correction
Election Commission notice
Anirban Bhattacharya
Kaushik Banerjee
Laboni Sarkar

More Telugu News