వెనెజువెలాపై దాడి అమెరికా మీడియాకు ముందే తెలిసినా కథనాలు ప్రచురించలేదు.. ఎందుకంటే?

  • వెనెజువెలాపై దాడిని శనివారం వేకువజామున ప్రకటించిన ట్రంప్
  • శుక్రవారం రాత్రి న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు పత్రికలకు సమాచారం
  • అమెరికా సైన్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే హెచ్చరికతో ప్రచురణ నిలిపివేత
వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు.. అగ్రరాజ్యం మీడియాకు ముందే తెలుసా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించకముందే, శుక్రవారం రాత్రి న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు పత్రికలకు సమాచారం అందిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అమెరికా మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రచురించకపోవడానికి ఒక కారణం ఉంది.

మీడియా సంస్థలు దీనిని ప్రచురిస్తే, విషయం బయటకు వెళ్లి అమెరికా సైన్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆయా పత్రికలు ఆపరేషన్‌కు సంబంధించిన విషయాలను కొంత సమయం పాటు ప్రచురించకుండా ఆపినట్లు తెలుస్తోంది. వెనెజువెలాపై దాడులకు సంబంధించిన వివరాలను ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్' ద్వారా శనివారం వేకువజామున ప్రకటించారు.

ఈ దాడుల కోసం ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. రాజధాని కారకాస్‌లో పలుచోట్ల పేలుళ్లు జరిగాయని వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టాయని, ఆ వెంటనే తమ పౌర, సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని తెలిపింది. కాసేపటికే ఆ దేశ అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు.


More Telugu News