బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

  • కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పించడంపై తీవ్ర ఆగ్రహం
  • బీసీసీఐ నిర్ణయం వల్లే మొదలైన ఈ వివాదం 
  • తదుపరి ఆదేశాల వరకు ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశం
తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే ఈ వివాదానికి కారణమైంది. కాగా, ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యాకాండ, భారత్ లో విమర్శలు రావ‌డం త‌దిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ముస్తాఫిజూర్ ను తొల‌గించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

2026 ఐపీఎల్ సీజన్‌ లో కేకేఆర్ జట్టులో ముస్తాఫిజుర్ కీలక పాత్ర పోషిస్తాడని అందరూ భావించారు. అయితే, ఎలాంటి స్పష్టమైన కారణం చూపకుండా బీసీసీఐ అతడిని జట్టు నుంచి తొలగించాలని కోరడం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ముస్తాఫిజుర్ పట్ల బీసీసీఐ వైఖరి తమను తీవ్రంగా బాధించిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "2026 మార్చి 26 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో మా స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సహేతుకమైన కారణం చెప్పలేదు. ఈ చర్య బంగ్లాదేశ్ ప్రజలను తీవ్రంగా బాధించింది" అని ప్రభుత్వం తెలిపింది.

"ఈ పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు, కార్యక్రమాల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశిస్తున్నాం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం" అని ఆ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 


More Telugu News