Apple iPhone: ఎగుమతుల్లో సత్తా.. అమ్మకాల్లోనూ టాప్.. భారత్‌లో యాపిల్ సరికొత్త రికార్డు!

Apples iPhone exports from India cross 50 billion Dollars under PLI scheme
  • భారత్ నుంచి 50 బిలియన్ డాలర్ల ఐఫోన్ల ఎగుమతి
  • పీఎల్ఐ పథకం కింద యాపిల్ సరికొత్త మైలురాయి
  • దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16
  • మొబైల్ తయారీలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరిన భారత్
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్, భారత ప్రభుత్వ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సరికొత్త మైలురాయిని అందుకుంది. 2025 డిసెంబర్ నాటికి భారత్‌లో తయారైన ఐఫోన్ల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.15 లక్షల కోట్లు) మార్కును అధిగమించాయి. యాపిల్ ఐదేళ్ల పీఎల్ఐ గడువు ముగియడానికి ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించడం విశేషం.

పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లోనే (ఏప్రిల్-డిసెంబర్ 2025) దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. ఇదే పథకం కింద ఐదేళ్లలో (FY21-FY25) శాంసంగ్ సంస్థ సుమారు 17 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను మాత్రమే ఎగుమతి చేయడంతో పోలిస్తే, యాపిల్ వృద్ధి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రధానంగా ఐఫోన్ల వల్లే భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్లు అతిపెద్ద ఎగుమతి విభాగంగా అవతరించాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 75 శాతం వాటా ఐఫోన్లదే. ఈ వృద్ధితో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న 99 శాతానికి పైగా ఫోన్లు 'మేడ్ ఇన్ ఇండియా' కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో టాటా గ్రూప్‌కు చెందిన మూడు, ఫాక్స్‌కాన్‌కు చెందిన రెండు ప్లాంట్లతో కలిపి మొత్తం ఐదు అసెంబ్లీ కేంద్రాల్లో ఐఫోన్లు తయారవుతున్నాయి. వీటికి అనుబంధంగా సుమారు 45 కంపెనీలు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి.

మరోవైపు దేశీయ మార్కెట్లోనూ యాపిల్ హవా కొనసాగుతోంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2025 తొలి 11 నెలల్లోనే దాదాపు 65 లక్షల ఐఫోన్ 16 యూనిట్లను విక్రయించి, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఆండ్రాయిడ్ ఫోన్లను అధిగమించడమే కాకుండా ఐఫోన్ 15 కూడా టాప్-5 జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ పీఎల్ఐ పథకం మార్చి 2026తో ముగియనుండగా, ప్రభుత్వం మద్దతును పొడిగించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
Apple iPhone
Apple
iPhone exports
Made in India
Smartphone PLI scheme
Foxconn
Tata Group
Counterpoint Research
Smartphone manufacturing
India smartphone market

More Telugu News