సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. అయితే ఈ ప‌ని చేయండి: సీపీ సజ్జనార్ కీల‌క సూచ‌న‌

  • సంక్రాంతికి ఊరెళ్లే వారికి హైదరాబాద్ పోలీసుల సూచనలు
  • ఇళ్లకు తాళాలు వేసే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని వెల్ల‌డి
  • నగదు, బంగారం ఇంట్లో ఉంచి వెళ్లొద్దని హితవు
  • సమాచారం ఇస్తే ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడతామన్న సీపీ సజ్జనార్
  • అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని విజ్ఞప్తి
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ కీలక సూచనలు చేశారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు, ప్రయాణానికి ముందే స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా ఓ పోస్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

పండుగ సెలవుల్లో చాలా కుటుంబాలు ఊళ్లకు వెళ‌తాయని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లోగానీ, బీట్‌ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌ సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచవద్దని సజ్జనార్ సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని అన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, వాటిని ముందుగానే నివారించడం కూడా ఆధునిక పోలీసింగ్‌లో భాగమని ఆయన తెలిపారు. ఇళ్ల భద్రతకు పోలీస్‌ శాఖ కట్టుబడి ఉందని, ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. ఏదైనా అత్యవసరమైతే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.


More Telugu News