విజయవాడలో ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి!

  • విజయవాడలో ఐఏఎస్ అధికారి కిశోర్ కుమార్ భార్య సత్య దీపిక మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత 
  • మొదట, అనుమానాలు లేవన్న కుటుంబ సభ్యులు
  • సోదరి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
  • దర్యాప్తు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జి.కె.కిశోర్ కుమార్ భార్య సత్య దీపిక (42) విజయవాడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కిడ్నీ సమస్య, గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 3న అర్ధరాత్రి దాటాక 1:20 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కిషోర్ కుమార్ కుటుంబం విజయవాడ మొగల్రాజపురంలో నివసిస్తోంది. సత్య దీపికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె డిసెంబరు 24 నుంచి 27 వరకు కిడ్నీ సమస్యకు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ గొంతు ఇన్ఫెక్షన్ రావడంతో డిసెంబరు 31న తిరిగి అదే ఆసుపత్రిలో చేరారు. మృతి చెందడానికి కొన్ని గంటల ముందు ఆమె తన సోదరి సరితకు ఫోన్ చేసి, మాట్లాడలేకపోతున్నానని, డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వస్తానని చెప్పారు.

అయితే, ఆమె అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందడంతో ఆసుపత్రి యాజమాన్యం దీనిని మెడికో లీగల్ కేసుగా పటమట పోలీసులకు తెలియజేసింది. మొదట కుటుంబ సభ్యులు మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, మృతురాలి సోదరి సరిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పటమట సీఐ పవన్ కిశోర్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News