Kalvakuntla Kavitha: హరీశ్ రావును మరోసారి టార్గెట్ చేసిన కవిత

Kalvakuntla Kavitha Targets Harish Rao Again
  • మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
  • ఒక్క మాటకే అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని వ్యాఖ్య
  • హరీశ్ పార్టీలో సొంతంగా గ్రూపు తయారు చేస్తున్నారని ఆరోపణ
  • కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శ
  • కర్ణాటక ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సూర్యాపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై హరీశ్ రావును లక్ష్యంగా చేసుకున్నారు.

వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక మాట అన్నందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తారా అని కవిత ప్రశ్నించారు. "ఆ అంశంపై వాకౌట్ చేసి, మళ్లీ సభకు రావొచ్చు కదా? బీఆర్ఎస్‌లో హరీశ్ ఓ గ్రూపును తయారు చేస్తున్నారు. బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశాన్ని వదులుకోవడం సరైంది కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు. హరీశ్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని, ఆయన నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.

అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత విమర్శలు చేశారు. ప్రతిపక్షం లేని సభలో కృష్ణా జలాలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. గత ప్రభుత్వాన్ని నిందించడంపై ఉన్న శ్రద్ధ, కృష్ణా నీటి వాటాలపై చర్చ జరపడంలో లేదని విమర్శించారు. తెలంగాణకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను రద్దు చేయాలని, ఆల్మట్టి డ్యాం ఎత్తు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా నీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఆమె ప్రశ్నించారు.
Kalvakuntla Kavitha
Harish Rao
BRS
Telangana Jagruthi
Telangana Assembly
Krishna River
Irrigation Projects
Upper Bhadra Project
Almatti Dam
Telangana Politics

More Telugu News