Animal Blood: డబ్బు కోసం పైశాచికత్వం.. మూగజీవాల రక్తం పిండి అమ్మకం.. దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారో తెలిస్తే..!

Fake Doctor Arrested for Illegal Animal Blood Trade in Medchal
  • మేడ్చల్ జిల్లాలో మూగజీవాల రక్తంతో అక్రమ దందా
  • నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాప్ యజమాని అరెస్ట్
  • దాడిలో 180 రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • వ్యాధులు తగ్గుతాయని నమ్మించి ఇతర రాష్ట్రాలకు విక్రయం
డబ్బు సంపాదన కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. మూగజీవాలను హింసిస్తూ వాటి రక్తంతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా గుట్టును మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. వైద్య వృత్తి పేరుతో ఓ నకిలీ పశువైద్యుడు సాగిస్తున్న ఈ దారుణ దందా వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక మటన్ షాప్ యజమాని, ఓ నకిలీ వెటర్నరీ డాక్టర్‌తో కలిసి ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్నాడు. గొర్రెలు, మేకలకు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా, అత్యంత క్రూరంగా సూదులతో వాటి శరీరం నుంచి రక్తాన్ని పీల్చేస్తున్నారు. కేవలం రక్తమే కాకుండా, దాని నుంచి ప్లేట్‌లెట్లను వేరు చేసి ప్యాకెట్లలో నిల్వ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 180 రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ముఠా సభ్యులు అడ్డగోలుగా రక్తాన్ని తీయడం వల్ల ఆ మూగజీవాలు తీవ్ర రక్తహీనతకు గురై, ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయని అధికారులు గుర్తించారు. తమ స్వార్థం కోసం బతికున్న జంతువులను ఇలా హింసించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ రక్తాన్ని, దాని నుంచి తీసిన ప్లేట్‌లెట్లను కొన్ని రకాల వ్యాధులకు మందుగా నమ్మించి, ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే, జంతువుల రక్తం తాగితే వ్యాధులు నయమవుతాయనడంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని, ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మటన్ షాప్ యజమానిని, నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. వారిపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో లోతుగా విచారణ కొనసాగుతోంది.
Animal Blood
Fake Doctor
Blood Sale
Meat Shop
Medchal
Illegal Blood Trade
Animal Cruelty
Veterinary Doctor
Telangana
Crime News

More Telugu News