Grok AI: ఏఐ 'గ్రోక్'పై కేంద్రం సీరియస్.. 72 గంటల గడువు

Indian Government Serious on Grok AI Asks for Report in 72 Hours
  • 'గ్రోక్' ఏఐతో అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం సీరియస్
  • ఎలాన్ మస్క్ 'ఎక్స్' యాజమాన్యానికి 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగిస్తున్నామని స్పష్టం చేసిన ఎక్స్
  • నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్న యాజమాన్యం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)కు భారత ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎక్స్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ 'గ్రోక్' ద్వారా అశ్లీల, అసభ్యకర కంటెంట్ సృష్టి, వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించింది. దీనిపై 72 గంటల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 'గ్రోక్' లేదా ఎక్స్ఏఐ (xAI)కి చెందిన ఇతర సర్వీసులను దుర్వినియోగం చేసి అశ్లీల, నగ్న, అసభ్యకరమైన కంటెంట్‌ను హోస్ట్ చేయడం, ప్రచురించడం, షేర్ చేయడం వంటివి జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ నోటీసులో పేర్కొంది.

కేంద్రం ఆదేశాలపై ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్ కార్ప్' ఆదివారం స్పందించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు, ముఖ్యంగా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నామని తెలిపింది. అవసరమైతే స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని 'ఎక్స్ సేఫ్టీ' విభాగం వెల్లడించింది. చట్టవిరుద్ధ కంటెంట్ కోసం 'గ్రోక్'ను వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మస్క్ చేసిన పోస్టుకు 'ఎక్స్ సేఫ్టీ' బదులిచ్చింది.

నిబంధనలు పాటించని పక్షంలో ఐటీ చట్టం,బీఎన్ఎస్‌, ఇతర చట్టాల ప్రకారం తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. చట్టవిరుద్ధ కంటెంట్ కాకుండా 'గ్రోక్' సాంకేతిక, పాలనాపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను సమగ్రంగా సమీక్షించాలని కూడా ఎక్స్‌ను ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే 'సేఫ్ హార్బర్' రక్షణను కోల్పోవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Grok AI
Elon Musk
X Corp
X AI
Artificial Intelligence
CSAM
child sexual abuse material
Indian Government
IT Act
social media

More Telugu News