Kritika Jain: సింగపూర్ లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. భారత మహిళ వ్యాఖ్య

Indian Woman Feels Safer in Singapore Than India at Night
  • ఎలాంటి భయాందోళన లేదని వెల్లడి
  • ఇదే భారతదేశంలో అయితే వణికిపోయేదాన్నని వ్యాఖ్య
  • వైరల్ గా మారిన వీడియో.. మహిళల భద్రతపై నెట్టింట చర్చ
సింగపూర్ లో అర్ధరాత్రి నిర్భయంగా నడుస్తున్నా.. అంటూ భారత మహిళ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వెనుక ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవని, తాను ఒంటరిగానే ఉన్నానని ఆమె చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను ఆమె చూపించారు. రోడ్లపై ఎవరూ లేకున్నా తనకు ఎలాంటి భయాందోళన లేదని తెలిపారు. ఇదే పరిస్థితి భారతదేశంలో ఎదురైతే వణికిపోయేదాన్నని, ఇలాంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేనని ఆమె వ్యాఖ్యానించారు.

ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియోలోని వివరాల ప్రకారం.. కృతికా జైన్ అనే భారత మహిళ కొంతకాలంగా సింగపూర్ లో ఉంటున్నారు. ఇటీవల ఆఫీసులో తన విధులు పూర్తిచేసుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఒంటరిగా ఇంటికి బయలుదేరారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళుతున్నానని కృతికా జైన్ చెప్పారు. ఇదే సమయంలో భారతదేశంలో తాను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా భయపడేదానినని అన్నారు.

సింగపూర్ లోని పర్యాటక ప్రాంతాలకన్నా అర్ధరాత్రి మహిళలు కూడా నిర్భయంగా బయటకు వెళ్లగలిగే అవకాశం ఉండటమే తనకు బాగా నచ్చిన విషయమని తెలిపారు. భారత్ లో లాగా భద్రత అనేది సింగపూర్ లో లగ్జరీ కాదని, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే నిత్యావసరం లాంటిదని పేర్కొన్నారు. ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. భారత్, సింగపూర్ లలో మహిళల భద్రతపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.
Kritika Jain
Singapore
India
women safety
night walk
social media
viral video
safety comparison
Indian woman
urban safety

More Telugu News