Donald Trump: వెనెజువెలా పరిపాలన బాధ్యత మాదే.. ట్రంప్

Donald Trump Claims Responsibility for Venezuela After Maduro Arrest
  • అధికార బదిలీ జరిగేంత వరకు పరిపాలిస్తామని ప్రకటన
  • ఆ దేశంలో చమురు వ్యాపారాన్ని చక్కదిద్దుతామన్న అమెరికా అధ్యక్షుడు
  • అమెరికా కంపెనీలు వెనెజువెలాలో అడుగుపెడతాయని వెల్లడి
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్టు తర్వాత ఆ దేశ బాధ్యతను తామే చేపడతామని, పరిస్థితులు చక్కబడే వరకు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు, అధికార బదిలీ సురక్షితంగా జరిగే వరకూ వెనెజువెలాను పరిపాలిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆ దేశంలో అస్తవ్యస్తంగా మారిన చమురు వ్యాపారాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా తమదేనని వెల్లడించారు. ఇందుకోసం అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలో అడుగుపెట్టి వ్యాపారం చేస్తాయని చెప్పారు.

చమురు వ్యాపారం ద్వారా వెనెజువెలాకు భారీగా సంపదను సమకూరుస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో ఎస్టేట్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వెనెజువెలా సురక్షితమని భావించే వరకూ, అధికారాల బదిలీ జరిగే వరకూ అక్కడ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదొక హెచ్చరిక’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అమెరికా సైన్యాన్ని ప్రశంసిస్తూ.. దుర్భేద్యమైన భవనంలో ఉన్నప్పటికీ మదురోను, ఆయన భార్యను తమ సైనికులు అరెస్టు చేసి తీసుకొచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి ఆపరేషన్ ప్రపంచంలో ఏ దేశమూ నిర్వహించలేదని చెప్పారు.

ఈ ఆపరేషన్ మొత్తం తాను లైవ్ లో చూసి ఆనందించానని ట్రంప్ పేర్కొన్నారు. దాడుల సందర్భంగా వెనెజువెలా రాజధానిలో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. మదురో అరెస్టుతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ఇక ఆ దేశ పౌరులను సంపన్నులుగా మార్చేలా, స్వతంత్రంగా బతికేలా చేస్తామని ట్రంప్ వెల్లడించారు.
Donald Trump
Venezuela
Nicolas Maduro
US Oil Companies
Venezuela Oil
US Foreign Policy
Mar-a-Lago
Venezuela Crisis
US Military
Venezuela Politics

More Telugu News