Donald Trump: మదురో అరెస్టు వేళ కొలంబియా అధ్యక్షుడికి ట్రంప్ వార్నింగ్

Trump Warns Colombia Over Drugs After Maduro Arrest
  • మదురోకు పట్టిన గతి చూశారు కదా అని హెచ్చరిక
  • అమెరికాలోకి మాదకద్రవ్యాలు పంపిస్తే ఎవరికైనా అదే గతి
  • కొలంబియాలోని డ్రగ్ లేబరేటరీలపై దాడులు చేస్తామంటూ పరోక్ష హెచ్చరిక
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించిన నేపథ్యంలో పొరుగునే ఉన్న కొలంబియాకు కూడా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మాదకద్రవ్యాలను అమెరికాలోకి డంప్ చేసే వారు ఎవరైనా సరే వారికి ఇదే గతి పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘మదురో తన దేశంలో కొకైన్ తయారుచేసి అమెరికాకు పంపించాడు.

అమెరికన్లను మత్తులో ముంచేయ్యాలని చూశాడు. ఇప్పుడు మదురోకు పట్టిన గతి చూశారు కదా. మా దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాలు పంపించేవారికి ఇదే గతి పడుతుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. కొలంబియా కూడా మాదకద్రవ్యాలను తయారుచేసి అమెరికాలోకి డంప్ చేస్తోందని ట్రంప్ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొలంబియాలోని డ్రగ్స్ తయారీ లేబరేటరీలపై దాడులు చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు.

వెనెజువెలాపై దాడిని ఖండించిన పెట్రో..
వెనెజువెలా రాజధాని కరాకస్ పై అమెరికా బలగాల దాడులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు. ఈ చర్య లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై జరిగిన దాడేనని విమర్శించారు. ఇది హ్యుమానిటేరియన్ క్రైసిస్ కు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, యాంటీ డ్రగ్ స్ట్రాటజీలో భాగంగా అమెరికా ఇటీవల కరేబియన్ సముద్రంలో తన నౌకలను మోహరించిన విషయం తెలిసిందే.

ఈ చర్యను విమర్శించిన పెట్రో.. కొలంబియాలోని డ్రగ్స్ తయారీ లేబరేటరీలపై దాడులు చేస్తామంటూ ట్రంప్ 
చేసిన పరోక్ష హెచ్చరికలను కూడా ఆక్షేపించారు. కొలంబియా భూభాగంపై దాడులు జరపడమంటే ఆక్రమణకిందే చూస్తామని పెట్రో స్పష్టం చేశారు.   
Donald Trump
Colombia
Gustavo Petro
Drug Trafficking
Nicolas Maduro
Venezuela
US Relations
Cocaine
Latin America
American Foreign Policy

More Telugu News