Narayana AP Minister: అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు మంత్రి నారాయణ భరోసా

Narayana Assures Amaravati Land Pooling Farmers
  • రాజధాని పరిధిలోని గ్రామాల్లో రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ
  • ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడి
  • ఐనవోలు గ్రామంలో గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్న మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో సుమారు రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

ఆరు నెలల్లోగా రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామసభలో పాల్గొని గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల పురోగతిని గ్రామస్థులకు మంత్రి వివరించారు. గ్రామాల్లో ఉన్న ఇతర అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని, ప్రజలు కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్కో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామనేది మంత్రి నారాయణ వివరించారు. 
Narayana AP Minister
Amaravati land pooling
Andhra Pradesh capital
AP capital development
Land pooling farmers
Ionavolu village
Sravan Kumar MLA
AP government
Infrastructure development
Nara Chandrababu Naidu

More Telugu News