LV Subrahmanyam: "ఎక్కువ తోమకండి సార్, అరిగిపోతాం"... చంద్రబాబుతో సరదా ఘటనలు గుర్తుచేసుకున్న ఎల్వీ

LV Subrahmanyam Recalls Funny Moments With Chandrababu Naidu
  • పని విషయంలో చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉంటారని వెల్లడి
  • వినాయక చవితి రోజు కూడా బస్సులోనే రివ్యూ పెట్టారని గుర్తుచేసుకున్న వైనం
  • ఆయన హయాంలోనే హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో ప్రపంచ స్థాయి సంస్కరణలు
  • గతంలో అధికారులకు విలువ ఉండేదని, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మారిపోయిందని వ్యాఖ్య
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని, ఆయన పనితీరును వివరిస్తూ ఒక ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నారు.  పని రాబట్టడంలో చంద్రబాబు తీవ్రతను, అదే సమయంలో తన చమత్కారాన్ని గుర్తుచేసుకున్నారు. 

'జర్నలిస్ట్ డైరీ' యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చంద్రబాబుతో పనిచేయడం ఇబ్బందిగా కాకుండా, ఆయన ఆలోచనా వేగాన్ని అందుకోవడానికి చేసే ఒక తీవ్రమైన కృషిలా ఉండేదని ఆయన అభివర్ణించారు. ఆలోచనా శక్తి లేని అధికారుల్లోకి కూడా తన ఆలోచనలను ప్రవేశపెట్టడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించేవారని, ఆయన్ను చూస్తే కొన్నిసార్లు జాలి కలిగేదని సరదాగా వ్యాఖ్యానించారు. 

ఒకానొక వినాయక చవితి రోజు జరిగిన గమ్మత్తైన సంఘటనను సుబ్రహ్మణ్యం గుర్తుచేసుకున్నారు. అధికారులందరితో కలిసి బస్సులో పర్యటిస్తున్నప్పుడు, అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్‌తో, "సార్, ఈరోజు మేమంతా వినాయకుడికి పూజ చేసుకోకుండా 'చంద్రుడిని' చూస్తున్నాం. మాకు ఏదో కీడు జరిగేలా ఉంది, మీరే కాపాడాలి" అని  సరదాగా అన్నాను.  నా మాటలకు ఆయన పెద్దగా నవ్వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, చంద్రబాబు మమ్మల్ని బస్సు ఎక్కించి అక్కడే రివ్యూ మొదలుపెట్టారు. అప్పుడు కూడా వదల్లేదు" అని ఎల్వీ వివరించారు.

ఆ రివ్యూ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, "కొన్ని డిపార్ట్‌మెంట్లలో మార్పు కనిపిస్తోంది. కానీ దీనికోసం నేను ఎంత శ్రమపడాల్సి వచ్చింది? ఎంత తోమితే ఈ మార్పు వచ్చింది?" అని అన్నారని ఎల్వీ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో తాను ఎదురుగా ఉండటంతో, "సార్, మమ్మల్ని మరీ ఎక్కువగా తోమకండి. అరిగిపోతాం" అని అన్నట్లు చెప్పారు. దానికి చంద్రబాబు నవ్వు ఆపుకుని, "నీతో ఇదే ప్రాబ్లం సుబ్రహ్మణ్యం, వర్క్‌ను సీరియస్‌గా తీసుకోవు" అని అన్నారని ఆనాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు.

అయితే, చంద్రబాబు అంత సీరియస్‌గా పనిచేయడం వల్లే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆయన హయాంలో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో ప్రపంచ స్థాయి సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఆ సంస్కరణలను చూసి ప్రపంచ బ్యాంకు సైతం ఆశ్చర్యపోయిందని, వాటర్ సెక్టార్‌పై అధ్యయనం చేయాలనుకునే వారిని హైదరాబాద్‌కు పంపించేదని తెలిపారు. ఢిల్లీ జల్ బోర్డు బృందం కూడా ఇక్కడికి వచ్చి తమ పనితీరును అధ్యయనం చేసిందని గుర్తుచేశారు. రెవెన్యూ పెంపు, జవాబుదారితనం, సిటిజన్ చార్టర్ వంటి అంశాలపై చంద్రబాబు లోతుగా దృష్టి సారించేవారని ఆయన ప్రశంసించారు.

తొమ్మిది మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం తనకు ఉందని చెబుతూ, గతంలో అధికారుల సలహాలకు, సూచనలకు ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ 'స్క్రిప్ట్ మారిపోయింది' అని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తూ, కొత్త ప్రయోగాలను ప్రోత్సహించే వాతావరణం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
LV Subrahmanyam
Chandrababu Naidu
IAS officer
Andhra Pradesh
Devender Goud
Hyderabad Metro Water Board
Civil Servant
Government official
AP Politics
Bureaucracy

More Telugu News