Pilli Manikya Rao: సీఎం కనిపించట్లేదంటున్నారు... రేపే ఆఫీసుకు వస్తారు: వైసీపీకి పిల్లి మాణిక్యాలరావు కౌంటర్

Pilli Manikya Rao Condemns YCP Propaganda on CM Chandrababus Foreign Trip
  • సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మాణిక్యాలరావు ఆరోపణ
  • రాజకీయంగా ఖాళీ అయిపోయి జగన్ బృందం పిచ్చి ప్రచారాలు చేస్తోందని విమర్శ
  • 18 గంటలు పనిచేసే నాయకుడు కుటుంబంతో వెళితే తప్పేంటని ప్రశ్న
  • పోలవరం, పెన్షన్లు, 22-ఏ భూముల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేశ్ కనిపించడం లేదని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని వైసీపీ 'సైకో బ్యాచ్' కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతోందని మాణిక్యరావు మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక, రాజకీయంగా నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్ రెడ్డి బృందం ఇలాంటి పిచ్చి ప్రచారాలతో సంతృప్తి పడుతోందని ఆయన విమర్శించారు. 

చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని అన్నారు. "వ్యక్తిగత దూషణలు, కుటుంబాలపై నీచ వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ రాజకీయాలను దిగజారుస్తోంది. ఇలాంటివి ప్రజలు పట్టించుకోరని ఆ సైకో బ్యాచ్ గుర్తుంచుకోవాలి" అని ఆయన హితవు పలికారు.

75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని మాణిక్యరావు గుర్తుచేశారు. "గత 18 నెలలుగా జగన్ రెడ్డి విధ్వంస పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు కుటుంబంతో గడిపేందుకు విదేశాలకు వెళితే కూడా వైసీపీ ఓర్వలేకపోతోంది" అని ఆయన అన్నారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించడం వంటి పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పెన్షన్ల కోసమే ఇప్పటివరకు దాదాపు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామని, జగన్ హయాంలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని మాణిక్యరావు తెలిపారు. జగన్ హయాంలో రైతుల భూములపై సైకో బొమ్మలు వేసి భయపెడితే, ఈ ప్రభుత్వం రాజముద్రతో పాసుపుస్తకాలు ఇచ్చి భూహక్కులకు భరోసా కల్పించిందని అన్నారు. 22-ఏ భూముల సమస్యను పరిష్కరించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 

"సీఎం కనిపించడం లేదని మాట్లాడేవారికి స్పష్టంగా చెబుతున్నాం. రేపు చంద్రబాబు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు, లోకేశ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజలకు మా నాయకత్వంపై సంపూర్ణ నమ్మకం ఉంది" అని మాణిక్యరావు ధీమా వ్యక్తం చేశారు.
Pilli Manikya Rao
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
TDP
YCP
Foreign Trip Controversy
Nara Lokesh
Polavaram Project
Pension Scheme

More Telugu News