Allu Arjun: మల్టీప్లెక్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్న అల్లు అర్జున్... అదిరిపోయే టెక్నాలజీతో థియేటర్
- 'పుష్ప 2'తో పాన్ ఇండియా లెవెల్లో తార స్థాయికి చేరుకున్న బన్నీ
- అల్లు సినిమాస్ పేరుతో గ్రాండ్ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్న అల్లు అర్జున్
- ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ‘పుష్ప 2’ తర్వాత కొత్త స్థాయికి చేరింది. ఈ సినిమా ఘనవిజయంతో అల్లు అర్జున్ దేశీయ సరిహద్దులను దాటి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు. మాస్ ఇమేజ్, స్టైల్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
కేవలం సినిమాలే కాక, అల్లు అర్జున్ ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అడుగుపెట్టాడు. ‘అల్లు సినిమాస్ (Allu Cinemas)’ పేరుతో హైదరాబాద్ కోకాపేటలో ఓ గ్రాండ్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నాడు. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా ఉండబోతోంది.
మల్టీప్లెక్స్‌లో ఫ్యాన్స్‌కు అంతర్జాతీయ స్థాయి అనుభూతి అందించడానికి అన్ని ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. 75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3డీ ప్రొజెక్షన్, పవర్‌ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సిస్టమ్, ఇలా ప్రతి అంశాన్ని టాప్ లెవల్‌లో డిజైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ సంక్రాంతి పండుగకు ప్రారంభం కానుందని సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే… థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడు.