Vemula Prashanth Reddy: అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
- అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్
- ప్రజా సమస్యలపై సీఎం సమాధానాలు చెప్పడం లేదని వేముల మండిపాటు
- వచ్చే సమావేశాల్లోనైనా తమకు మైక్ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ పార్టీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసింది. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పకపోవడం అసెంబ్లీ ధర్మానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. “ప్రజా సమస్యలపై సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ, హరీశ్ రావును టార్గెట్ చేయడం అసహ్యకరం” అని తెలిపారు.
ప్రశాంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహారాన్ని కూడా ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికారపక్షానికి మాత్రమే మైక్ ఇవ్వడం దారుణమని అన్నారు. అందుకే తాము అసెంబ్లీని బహిష్కరించామని తెలిపారు. “అసెంబ్లీని బహిష్కరించాల్సి రావడం బాధాకరం, ఇప్పటికైనా వారికి కనువిప్పు కలిగి, వచ్చే సమావేశాల్లోనైనా మాకు మైక్ ఇవ్వాలనేది మా డిమాండ్” అని చెప్పారు.