: కూతురు కాపురంలో గొడవలు.. కలతచెంది గోదావరిలో దూకిన తల్లి

  • కుమార్తె, మనవరాలితో కలిసి రాజమహేంద్రవరం బ్రిడ్జి వద్ద ఆత్మహత్యాయత్నం
  • నదిలో దూకిన తల్లి.. కుమార్తె, మనవరాలిని అడ్డుకున్న స్థానికులు
  • తనవల్లే తల్లి గోదావరిలో దూకిందని కన్నీటిపర్యంతమైన కుమార్తె
రాజమహేంద్రవరంలోని రోడ్‌ కం రైలు వంతెనపై శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. కుమార్తె, మనవరాలితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. బ్రిడ్జిపై నడుస్తూ ఉన్నట్టుండి తల్లి నదిలో దూకగా.. ఆ వెంటనే దూకబోతున్న కూతురు, మనవరాలిని స్థానికులు అడ్డుకుని కాపాడారు. నదిలో దూకిన తల్లి ఈగల ధనలక్ష్మి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 
 
దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి తన కుమార్తె విజయకుమారిని మండపేటకు చెందిన బూసాల వినయ్‌కుమార్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వారికి కుమారుడు మోక్షిత్ (4), కుమార్తె లక్ష్మీప్రసన్న(1.5) ఉన్నారు. ఇటీవల ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వినయ్ తనను వేధిస్తున్నాడని విజయ తన తల్లి ధనలక్ష్మితో చెప్పుకుని బాధపడింది. దీంతో కూతురి కాపురాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశంతో ధనలక్ష్మి శుక్రవారం ఉదయం మండపేట వెళ్లారు.

కూతురు, అల్లుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ధనలక్ష్మి కుమార్తె విజయ, మనవరాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజమహేంద్రవరం చేరుకుని ఆటోలో వంతెనపైకి వెళ్లారు. కొంతదూరం నడుస్తూ వెళ్లిన ధనలక్ష్మి సడెన్ గా గోదావరిలో దూకారు. ఆ వెంటనే విజయకుమారి, లక్ష్మీ ప్రసన్న కూడా దూకబోతుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న కొవ్వూరు పోలీసులు.. విజయ, లక్ష్మీప్రసన్నలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోదావరిలో దూకిన ధనలక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తన కాపురం చక్కదిద్దాలని వచ్చి తన కళ్ల ముందే తల్లి గోదావరిలో దూకడంతో విజయకుమారి కన్నీటిపర్యంతమైంది. ముగ్గురం చనిపోవాలని అనుకున్నామని, తల్లి దూకిన తర్వాత తనను దూకకుండా స్థానికులు బలవంతంగా ఆపేశారని చెప్పింది. తనవల్లే తల్లికి కష్టాలొచ్చాయంటూ వాపోయింది.

More Telugu News