Raihan Vadra: గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి: వైభవంగా ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్థం

Raihan Vadra Engagement Grand Celebration in Gandhi Family
  • చిన్ననాటి స్నేహితురాలు అవివా బేగ్‌తో రైహాన్ వాద్రా ఎంగేజ్‌మెంట్
  • రణథంబోర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వేడుక
  • ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న రైహాన్ - అవివా
  • రైహాన్ వాద్రా వృత్తిరీత్యా విజువల్ ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో రైహాన్ డార్క్ షేర్వాణీలో కనిపించగా, అవివా ఎంబెల్లిష్డ్ శారీలో మెరిసిపోయారు. తమ చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేస్తూ, తమ స్నేహం ఎంత పురాతనమైనదో వారు గుర్తుచేసుకున్నారు.

అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వారు. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త కాగా, తల్లి నందితా బేగ్ ఇంటీరియర్ డిజైనర్. నందితకు ప్రియాంకా గాంధీతో దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్' ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. అవివా ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదివి, ఆ తర్వాత జర్నలిజం అభ్యసించారు. ప్రస్తుతం ఆమె కూడా ఇంటీరియర్ డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు.

    
25 ఏళ్ల రైహాన్ వాద్రా తన విద్యాభ్యాసాన్ని డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ 'డూన్ స్కూల్'లో పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో ఆయన తాత రాజీవ్ గాంధీ, మామ రాహుల్ గాంధీ కూడా చదువుకున్నారు. అనంతరం లండన్‌లోని ఎస్‌వోఏఎస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేసిన రైహాన్ ప్రస్తుతం విజువల్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. వైల్డ్ లైఫ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముంబైలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీల్లో ఆయన తీసిన చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. వీరి వివాహం వచ్చే కొన్ని నెలల్లోనే జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

      
Raihan Vadra
Priyanka Gandhi
Aviva Beg
Engagement
Ranthambore
Congress Party
Robert Vadra
Wedding
India
Indira Bhavan

More Telugu News