Cyber Fraud: డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా

Hyderabad Elderly Man Duped of 7 Crore in Sophisticated Cyber Fraud
  • హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన 81ఏళ్ల వృద్దుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.7 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
  • మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్
ఒకవైపు డిజిటల్ అరెస్టులు ఉండవని పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు మాత్రం తమ తెలివితేటలతో ప్రజలను భారీగా మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.7 కోట్లకు పైగా కాజేశారు.

సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 27న ఆయన వాట్సాప్‌కు వచ్చిన కాల్‌లో ముంబయి నుంచి బ్యాంకాక్‌కు పంపిన కొరియర్‌లో ల్యాప్‌టాప్, పాస్‌పోర్టులు, మాదకద్రవ్యాలు ఉన్నాయని చెప్పి భయపెట్టారు. తాను ఎలాంటి కొరియర్ పంపలేదని చెప్పగానే, ముంబయి పోలీసులమంటూ మరో కాల్ చేసి మాదకద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని బెదిరించారు.

ఇంటి నుంచి కదలొద్దంటూ ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని చెప్పి వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆర్థిక లావాదేవీల పరిశీలన పేరుతో తొలుత రూ.19.80 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అనంతరం సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్ చేయించి, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న రూ.7.12 కోట్లను తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పరిశీలన పూర్తయ్యాక డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించారు.

డిసెంబరు 29న మరోసారి ఫోన్ చేసి కేసు మూసివేతకు అంటూ మరో రూ.1.2 కోట్లు అడగడంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. ఇటీవల డిజిటల్ అరెస్టులపై వచ్చిన వార్తలను చూసి తాను మోసపోయినట్లు గ్రహించి శుక్రవారం 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు. 
Cyber Fraud
Hyderabad Cyber Crime
Digital Arrest Scam
Cyber Security Bureau
Money Laundering
Online Scam
WhatsApp Fraud
Signal App
Cyber Police
Financial Fraud

More Telugu News