బీహార్‌లో రైల్లో రూ.1.44 కోట్ల విలువైన బంగారం చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

  • పోలీసు అధికారికి దోపిడీలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
  • రైల్లో ప్రయాణించిన వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్ల చోరీ
  • నిద్రపోతున్న సమయంలో బంగారు బిస్కెట్ల దొంగతనం
బీహార్‌లో గతేడాది రైలులో జరిగిన కోట్ల రూపాయల విలువైన బంగారం దోపిడీ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీలో ఓ పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గతేడాది రైలులో రూ.1.44 కోట్ల విలువైన బంగారం దోపిడీ జరిగింది.

కోల్‌కతాకు చెందిన బంగారు వ్యాపారి ధనంజయ్ గత ఏడాది నవంబర్ నెలలో హౌరా - బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో జైపూర్ వెళుతుండగా గయ స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు పోలీస్ యూనిఫాంలో రైలు ఎక్కారు. వారిలో ఇద్దరు వ్యాపారి పక్కన కూర్చుని అతనితో మాట్లాడుతూ వ్యాపార వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతను నిద్రిస్తున్న సమయంలో బంగారు బిస్కెట్లను దొంగిలించారు.

నిద్ర మేల్కొన్న తర్వాత బంగారు బిస్కెట్లు పోయాయని గుర్తించిన వ్యాపారి పాట్నా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు, రైల్వే అధికారుల కాల్ రికార్డింగ్సును పరిశీలించారు. ఈ దోపిడీలో గయ జీఆర్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ సింగ్, ఇతర సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని జీఆర్పీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో రాజేశ్ కుమార్ సింగ్‌ను అరెస్టు చేశారు.


More Telugu News