సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి... లైవ్ లొకేషన్ పంపాలన్న బాస్!

  • సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి బాస్ షాక్
  • ప్రూఫ్‌గా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఆదేశం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్
  • భారతీయ వర్క్ కల్చర్‌పై నెట్టింట తీవ్ర చర్చ
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ సిక్ లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి తన బాస్ నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. అనారోగ్యానికి రుజువుగా లైవ్ లొకేషన్ షేర్ చేయాలని బాస్ డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతీయ కార్యాలయాల్లోని పని సంస్కృతి (వర్క్ కల్చర్), ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతపై (ప్రైవసీ) ఈ ఘటన మరోసారి చర్చను రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే, ఓ ఉద్యోగి తనకు తీవ్రమైన తలనొప్పిగా ఉందని, సెలవు కావాలని వాట్సాప్‌లో తన బాస్‌ను కోరాడు. మొదట హెచ్‌ఆర్‌తో మాట్లాడాలని చెప్పిన బాస్, ఆ తర్వాత హెచ్‌ఆర్ విభాగం "వాలిడ్ డాక్యుమెంట్స్" అడిగిందని ఉద్యోగి చెప్పగానే, వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయాలని ఆదేశించాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను సదరు ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. "ఇది సరైంది కాదని నాకు తెలుసు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?" అని సలహా కోరాడు.

ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. బాస్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగి ప్రైవసీని ఉల్లంఘించడమేనని, లొకేషన్ ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు. "తలనొప్పికి వాలిడ్ డాక్యుమెంట్ ఏంటి? బాధపడుతున్న ఫొటోలు పంపాలా?", "ఇది ఉద్యోగం, బానిసత్వం కాదు" అంటూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి టాక్సిక్ మైక్రో మేనేజ్‌మెంట్ వల్లే దేశీయ కంపెనీలు వెనుకబడుతున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు.



More Telugu News