Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ విషయంలో కోచ్ లు తప్పు చేస్తున్నారు: యోగరాజ్ సింగ్

Yograj Singh Criticizes Coaches for Misleading Arjun Tendulkar
  • అర్జున్ టెండూల్కర్ ఒక బ్యాటర్ అని, బౌలర్‌గా చూడొద్దని యోగరాజ్ సింగ్ వ్యాఖ్య
  • అతడి కోచ్‌లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ అసంతృప్తి
  • ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనింగ్ చేయించాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపణ
  • తన అకాడమీలో అర్జున్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని వెల్లడి
మాజీ భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ ప్రధానంగా ఒక బ్యాటర్ అని, అతని బ్యాటింగ్ శైలి అచ్చం తండ్రి సచిన్‌ను పోలి ఉంటుందని, కానీ కోచ్‌లు అతడిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించాడు. బౌలింగ్‌పైనే అధికంగా దృష్టి పెట్టి, అతనిలోని బ్యాటర్‌ను విస్మరిస్తున్నారని విమర్శించాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ఈ విషయాలను వెల్లడించాడు. గతంలో అర్జున్ తన అకాడమీకి వచ్చినప్పటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. "నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి బ్యాటింగ్ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయాడు. నెట్స్‌లో అతని బ్యాటింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. బంతిని గ్రౌండ్ నలువైపులా కొడుతున్నాడు. ఇంత మంచి బ్యాటర్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని కోచ్‌లను నిలదీశాను" అని యోగ్‌రాజ్ తెలిపాడు.

తన అకాడమీలో వారం రోజుల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాకే, అర్జున్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడని యోగ్‌రాజ్ గుర్తుచేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా, అర్జున్‌ను ఓపెనర్‌గా పంపాలని యాజమాన్యాన్ని కోరినా వారు పట్టించుకోలేదని వెల్లడించాడు.

కాగా, 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ 2022 డిసెంబర్‌లో గోవా తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రాజస్థాన్‌పై 120 పరుగులు సాధించాడు. సరిగ్గా ఇలాగే సచిన్ కూడా 1988లో తన రంజీ అరంగేట్రంలో సెంచరీ చేయడం గమనార్హం.
Arjun Tendulkar
Sachin Tendulkar
Yograj Singh
Yuvaraj Singh
Mumbai Indians
Ranji Trophy
Cricket
Batting
Bowling
Goa Cricket

More Telugu News