తమిళనాడులో ఆకాశాన్నంటిన పూల ధరలు.. కిలో మల్లెలు రూ. 3,000

  • మార్గళి పూజలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పెరిగిన పూల గిరాకీ
  • తేని జిల్లా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రూ. 3,000 పలికిన కిలో మల్లెపూల ధర
  • మంచు ప్రభావంతో తగ్గిన దిగుబడి.. 
  • సంక్రాంతి సమీపిస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం
తమిళనాడులో ఆధ్యాత్మిక మాసం మార్గళి పూజలకు తోడు, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు తోడవడంతో పూల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మల్లెపూల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరాయి. గురువారం మధురై మార్కెట్‌లో కిలో మల్లెలు రూ. 2,500 పలకగా, తేని జిల్లా ఆండిపట్టి మార్కెట్‌లో ఏకంగా రూ. 3,000 మార్కును తాకాయి.

రాష్ట్రంలో వర్షాలు తగ్గి మంచు కురుస్తుండటంతో పూల దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం కూడా కావడంతో పూలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మల్లెపూలతో పాటు ఇతర పూల ధరలు కూడా పెరిగాయి. కిలో కనకాంబరం రూ. 2,500, ములై పూలు రూ. 1,200, పన్నీటి గులాబీలు రూ. 200 చొప్పున విక్రయించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పూల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 


More Telugu News