KTR: మళ్లీ అలాంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి: కేటీఆర్

KTR Says Telangana Faces Setbacks Under Congress Rule
  • క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదన్న కేటీఆర్
  • రెండేళ్లుగా తెలంగాణ తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆందోళన
  • తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా శాశ్వతమని వ్యాఖ్య
క్యాలెండర్‌లో తేదీలు, సంవత్సరాలు మారుతున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవితాల్లో మార్పులు ఏమో గానీ, తెలంగాణ రాకముందు రోజులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్ఎసస్ పార్టీ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రం రెండు సంవత్సరాలుగా అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఉన్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంతో, సమైక్యవాదులతో కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించామని అన్నారు.

కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బలంగా గళమెత్తారని కేటీఆర్ అన్నారు. గెలుపోటములు శాశ్వతం కాదని, తాత్కాలికమని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా శాశ్వతమని అన్నారు. ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆట అయితే, బీఆర్ఎస్‌కు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని అన్నారు.

కేంద్రం, రాష్ట్రం కలిసి, రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజల దీవెన, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని, ఆ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
KTR
K Taraka Rama Rao
BRS
Telangana
Congress
KCR
Revanth Reddy
Telangana Politics

More Telugu News