Amazon: భారత్‌లో చిక్కుకున్న హెచ్‌-1బీ ఉద్యోగులకు అమెజాన్ బంపరాఫర్

Amazon offers work from home for H1B employees stuck in India
  • హెచ్-1బీ వీసా జాప్యంతో భారత్‌లోనే ఉండిపోయిన అమెజాన్ ఉద్యోగులు
  • 2026 మార్చి 2 వరకు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతి
  • కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి పనులు చేయకూడదని కఠిన ఆంక్షలు
  • ఇండియాలోని అమెజాన్ ఆఫీసులకు వెళ్లడంపై కూడా నిషేధం
హెచ్-1బీ (H-1B) వీసా జాప్యం కారణంగా అమెరికాకు వెళ్లలేక భారత్‌లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు టెక్ దిగ్గజం అమెజాన్ భారీ ఊరటనిచ్చింది. వీసా అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు 2026 మార్చి 2 వరకు భారత్ నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసుకునే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలనే నిబంధనను ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పేర్కొంది.

2025 డిసెంబర్ 13 నాటికి భారత్‌లో ఉండి, వీసా స్లాట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అయితే, ఈ వెసులుబాటుతో పాటు కంపెనీ కొన్ని వింత ఆంక్షలను కూడా విధించింది. ఇండియా నుంచి పనిచేసే ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోడింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ వంటి సాంకేతిక పనులు చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు భారత్‌లోని ఏ అమెజాన్ కార్యాలయానికి వెళ్లకూడదని, టీమ్ మేనేజ్‌మెంట్ లేదా ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి అధికారిక నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. కేవలం పరిమితమైన విధులను మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది.

చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.  అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది టెక్కీలకు తాత్కాలికంగా ఊరటనిచ్చింది.

మరోవైపు గూగుల్, యాపిల్ వంటి సంస్థలు కూడా వీసా సమస్యల దృష్ట్యా అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి.
Amazon
H-1B visa
H-1B employees
Work from home
India
US visa delay
Tech jobs
Amazon India
Visa appointments
Tech workers

More Telugu News