'రాజాసాబ్' హిట్టయితే నేను వారికి దొరకనేమోనని భయంతో ఉన్నారు: డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్య

  • నేను ఎదిగితే బిజీ అయిపోతానని కొందరు భావిస్తుండవచ్చన్న మారుతి
  • ఈర్ష్య, అసూయ మానవ నైజమన్న డైరక్టర్ మారుతి
  • పెద్ద హీరోలతో చేసినా చిన్న సినిమా తీయాలనుకుంటే తీస్తానని స్పష్టీకరణ
విజయం సాధించి ఎదిగితే తాను వారికి దొరకనేమోననే భయంతో కొంతమంది 'రాజాసాబ్' చిత్రం ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నట్లుందని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో, టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మించిన చిత్రం 'రాజాసాబ్'. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మారుతి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీరు విజయం సాధించకూడదని, ఈ సినిమాకు ఆదరణ రాకూడదని కొందరు కోరుకుంటున్నారని, వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి మారుతి సమాధానమిస్తూ, తాను ఎదిగితే బిజీ అయిపోతానని కొందరు అలా భావిస్తుండవచ్చని అన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు కోరుకుంటారని, పక్కింటి వాళ్లు కారు కొనుక్కుంటే దానికి ఏదైనా అవ్వాలని కోరుకునే వాళ్లు ఉంటారని పేర్కొన్నారు.

ఈర్ష్య, అసూయ మానవ నైజమని మారుతి అన్నారు. తాను విజయం సాధించి ఎదిగితే వాళ్లకు దొరకనేమో అనే భయంతో వారు అలా అనుకొని ఉంటారని అన్నారు. ఇప్పుడు తాను చిన్న సినిమా ఈవెంట్లకు వెళుతున్నానని, ఒకవేళ తనకు భారీ సక్సెస్ వస్తే అలా రానేమో అని వాళ్ళకు భయం ఉండవచ్చని అన్నారు. వాళ్లు అసూయ వల్ల అలా అనుకుంటున్నారని, కానీ తాను మాత్రం అలా ఆలోచించడం లేదని పేర్కొన్నారు.

తాను భారీ విజయం సాధిస్తే కథ చెప్పడానికి వెళితే పట్టించుకోనేమోనని భావిస్తున్నారని అన్నారు. సినిమా ఫెయిల్ అయితేనే తాను వారి వైపు చూస్తానని వారు అనుకుంటున్నట్లుగా ఉందని అన్నారు. ఎప్పుడూ స్టార్ డమ్ శాశ్వతమని తాను అనుకోనని మారుతి స్పష్టం చేశారు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనిపించినా తీస్తానని స్పష్టం చేశారు. అగ్ర నటుడితో తీశాను కాబట్టి అన్నీ అలాంటివే రావాలనే కోరిక తనకు లేదని, తనకు కథ ముఖ్యమని అన్నారు.


More Telugu News