తాజ్ జీవీకే నుంచి టాటా గ్రూప్ నిష్క్రమణ.. రూ.592 కోట్లకు విక్రయం

  • తాజ్ జీవీకేలో తనకున్న 25.52 శాతం వాటాను విక్రయించిన ఐహెచ్‌సీఎల్
  • ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన షాలినీ భూపాల్‌కు విక్రయించిన ఐహెచ్‌సీఎల్
  • 1.60 కోట్ల షేర్లను ఒక్కొటి రూ.370 ధరతో మొత్తం రూ.592 కోట్లకు విక్రయం
తాజ్ చైన్ ఆఫ్ హోటల్స్‌ను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐ‌హెచ్‌సీఎల్), తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించింది. తాజ్ జీవీకే హోటల్స్ నుంచి టాటా గ్రూప్ పూర్తిగా వైదొలగడంతో ఆతిథ్య రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ప్రతిష్ఠాత్మక భాగస్వామ్యం ముగిసింది.

తాజ్ జీవీకేలో తనకున్న 25.52 శాతం వాటాను ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన షాలినీ భూపాల్‌కు విక్రయించినట్లు ఐహెచ్‌సీఎల్ తెలిపింది. 1.60 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.370 ధరతో మొత్తం రూ.592 కోట్లకు విక్రయించింది.

దీని ఫలితంగా తాజ్ జీవీకేలో జీవీకే-భూపాల్ కుటుంబ వాటా 49 శాతం నుంచి 74.99 శాతానికి పెరిగింది. దీంతో వారికి పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. బోర్డులోని ఐహెచ్‌సీఎల్ నామినేటెడ్ డైరెక్టర్లందరూ రాజీనామా చేశారు. వాటాల విక్రయం నేపథ్యంలో 2011 నాటి షేర్ హోల్డర్స్ ఒప్పందం, 2007 నాటి ట్రేడ్‌మార్క్ లైసెన్స్ ఒప్పందం రద్దయ్యాయి.

తాజ్ జీవీకే హోటల్స్ నుంచి టాటా నిష్క్రమించడంతో సంస్థ తన కార్పొరేట్ పేరు నుంచి 'తాజ్' అనే పదాన్ని తొలగించి కొత్త పేరును స్వీకరించడానికి సిద్ధమైంది. ఐహెచ్‌సీఎల్ ఇకపై కేవలం నిర్వహణ భాగస్వామిగా మాత్రమే సేవలను అందించనుంది. టాటా గ్రూప్ ఆస్తులపై పెట్టుబడులను తగ్గించి సేవలపై మరింత దృష్టి సారించే క్యాపిటల్ లైట్ వ్యూహాన్ని అనుసరిస్తోంది.


More Telugu News