ప్రత్యర్థి నామినేషన్ పత్రాలు చించి తిన్న శివసేన అభ్యర్థిపై కేసు

  • పూణే మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన
  • ఈ నెల 15న మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు
  • ఇద్దరికి నామినేషన్‌కు సంబంధించిన ఏబీ ఫారమ్‌లు ఇచ్చిన శివసేన
  • ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో పత్రాలు చించి తిన్న అభ్యర్థి
శివసేన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, పార్టీలోనే తన ప్రత్యర్థి అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించి మింగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ధంకావడి సహకార్ నగర్ వార్డు కార్యాలయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పుణే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ విచిత్ర సంఘటన జరిగింది. పూణేలో ఈ నెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

శివసేన పార్టీ 34వ వార్డులో ఇద్దరు అభ్యర్థులకు ఏబీ ఫారమ్‌లను ఇచ్చింది. దీంతో పార్టీ అభ్యర్థులు ఉద్ధవ్ కాంబ్లీ, మచ్చింద్ర ధావలే మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ధావలే చేతిలో ఉన్న ఏబీ ఫారమ్‌లను కాంబ్లీ లాక్కొని, వాటిని ముక్కలుగా చించి మింగేశారు.

మచ్చింద్ర ధావలే ఫిర్యాదు మేరకు ఉద్దవ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు కూడా కేసు నమోదు చేశామని, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. మహారాష్ట్రలోని 29 నగరాలలో జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, పూణే వాటిలో ఒకటి.


More Telugu News