నెట్‌ఫ్లిక్స్‌లో ‘సత్యం రామలింగరాజు’ కథ.. స్ట్రీమింగ్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్!

  • రామలింగరాజు పిటిషన్‌ను కొట్టివేసిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు
  • ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ సిరీస్‌లో సత్యం కుంభకోణం ఎపిసోడ్ విడుదల
  • 2020 నుంచి కొనసాగుతున్న స్టే వెకేట్
  • పబ్లిక్ రికార్డుల ఆధారంగానే డాక్యుమెంటరీ
  • వ్యక్తిగత గోప్యతకు భంగం లేదని కోర్టు తీర్పు
ఐటీ దిగ్గజం సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజుకు కోర్టులో చుక్కెదురైంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా’ డాక్యుమెంటరీ సిరీస్‌లో సత్యం కుంభకోణం ఎపిసోడ్ స్ట్రీమింగ్‌పై ఐదేళ్లుగా ఉన్న స్టేను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎత్తివేసింది. దీనితో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నాలుగో ఎపిసోడ్ ‘రైడింగ్ ది టైగర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

2020లో నెట్‌ఫ్లిక్స్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రతా రాయ్, రామలింగరాజుల ఆర్థిక నేరాలపై ఒక ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌ను ప్రకటించింది. అయితే, తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని, తనపై జరుగుతున్న విచారణ ప్రభావితం అవుతుందని రామలింగరాజు 2020 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన మూడు ఎపిసోడ్లు విడుదలైనప్పటికీ సత్యం ఎపిసోడ్ మాత్రం నిలిచిపోయింది.

ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సిటీ సివిల్ కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి మంగళవారం (డిసెంబర్ 30, 2025) తుది తీర్పు వెలువరించారు. ఈ డాక్యుమెంటరీ కేవలం పబ్లిక్ రికార్డులు, వార్తా పత్రికల్లో వచ్చిన సమాచారం, లిఖితపూర్వక పత్రాల ఆధారంగానే రూపొందించబడిందని కోర్టు అభిప్రాయపడింది. ఇందులో రామలింగరాజు వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం జరగలేదని, ప్రజలకు ఒక చారిత్రక ఆర్థిక మోసం గురించి వివరించడమే దీని ఉద్దేశమని నెట్‌ఫ్లిక్స్ వాదనతో కోర్టు ఏకీభవించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు త్వరితగతిన విచారణ పూర్తి చేసిన కోర్టు, గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. "సత్యం కంప్యూటర్స్ విజయవంతం అయిన తర్వాత రామలింగరాజు వేసిన లెక్కలు తప్పాయి.. ఆ కథను ఇప్పుడు చూడండి" అంటూ ఎపిసోడ్ విడుదలైనట్లు వెల్లడించింది. 2009లో దేశాన్ని కుదిపేసిన $1.5 బిలియన్ల డాలర్ల (సుమారు రూ. 7,000 కోట్ల) అకౌంటింగ్ ఫ్రాడ్ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ సాగుతుంది. 


More Telugu News