ఈ మాత్రలు వాడొద్దు... తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

  • నిమెసులైడ్ 100 ఎంజీ దాటిన మందుల తయారీ, విక్రయాలపై నిషేధం
  • కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో అప్రమత్తమైన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్
  • కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో నిర్ణయం
  • ప్రజలు వెంటనే ఆ మందుల వాడకం ఆపేయాలని సూచన
  • ప్రత్యామ్నాయ మందుల కోసం వైద్యులను సంప్రదించాలి
నిమెసులైడ్ (Nimesulide) 100 ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో ఉన్న మందులను ప్రజలు వాడొద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) బుధవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మందుల తయారీ, విక్రయం మరియు పంపిణీని దేశవ్యాప్తంగా నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిమెసులైడ్ అనేది నొప్పి నివారణకు వాడే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అయితే ఇది కాలేయం (లివర్) పై విషపూరిత ప్రభావం చూపడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సంప్రదింపుల అనంతరం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26ఏ కింద ఈ అధిక మోతాదు మందులను నిషేధించారు. కేవలం అధిక మోతాదు మందులకే ఈ నిషేధం వర్తిస్తుందని, తక్కువ మోతాదు ఫార్ములేషన్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ తరహా మందులు వాడుతున్న రోగులు తక్షణం వాటిని ఆపేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం సూచించారు. సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్స కోసం అర్హులైన వైద్యులను సంప్రదించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధిత మందులను కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ ఉంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మార్కెట్ నుంచి ఈ మందులను పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ బ్రాండ్లను విక్రయించే ఫార్మా కంపెనీలు తక్షణం ఉత్పత్తిని నిలిపివేసి, మార్కెట్లో ఉన్న స్టాక్‌ను వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఈ మందులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే సమీపంలోని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ లేదా డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.


More Telugu News