New Zealand: 2026 సంవత్సరానికి అట్టహాసంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్... వెలిగిపోయిన స్కై టవర్

New Zealand Welcomes New Year 2026 with Grand Celebrations
  • మొదటగా 2026కి స్వాగతం పలికిన పసిఫిక్ దేశాలు
  • న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
  • వర్షం కురుస్తున్నా స్కై టవర్ నుంచి బాణసంచా కాల్పులు
  • అందరికంటే ముందు కొత్త ఏడాదిని చూసిన కిరిబాటి దీవి
  • న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లో పలుచోట్ల రద్దయిన వేడుకలు
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్యాలెండర్ మారుతున్న వేళ.. కిరిబాటి దీవుల తర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2026కు ఘన స్వాగతం పలికింది. అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియారం ముల్లు 12 దాటగానే.. ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం 'స్కై టవర్' బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది.

సుమారు 5 నిమిషాల పాటు సాగిన ఈ కనువిందులో 3,500 రకాల బాణసంచాను స్కై టవర్ అంతస్తుల నుంచి కాల్చారు. అయితే, అక్కడి వాతావరణం వేడుకలకు కాస్త ఆటంకం కలిగించింది. భారీ వర్షం, ఉరుముల సూచన ఉండటంతో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లోని పలు చిన్న కమ్యూనిటీ ఈవెంట్లను రద్దు చేశారు. అయినా ప్రధాన వేడుకలు మాత్రం వర్షంలోనే కొనసాగాయి. 

ఆక్లాండ్ కంటే ముందే, పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల దేశమైన 'కిరిబాటి'లోని ఓ అటోల్ (కిరితిమతి దీవి) ప్రపంచంలోనే తొలిసారిగా 2026లోకి అడుగుపెట్టింది. అక్కడి అనుభవాన్ని ఓ పర్యాటకుడు వివరిస్తూ.. "శాటిలైట్లు లేవు, మనుషుల జాడ లేదు, చిమ్మచీకటి, లెక్కలేనన్ని పీతలు మాత్రమే ఉన్నాయి" అంటూ ప్రకృతి ఒడిలో న్యూ ఇయర్ జరుపుకున్నట్లు తెలిపారు. 

ఇక 600 మంది జనాభా మాత్రమే ఉండే న్యూజిలాండ్ చాతం ఐలాండ్‌లోనూ కొత్త ఏడాది సంబరాలు జరిగాయి. తెల్లవార్లూ తమ బృందం వేడుకలు చేసుకుంటుందని అక్కడి ఓ హోటల్ యజమాని పేర్కొన్నారు. ప్రపంచంలోని తూర్పు దేశాల నుంచి పడమర వైపునకు కొత్త సంవత్సరం 2026 నెమ్మదిగా విస్తరిస్తోంది.
New Zealand
Auckland
New Year 2026
Sky Tower
Kiribati
Chatham Islands
New Year Celebrations
Pacific Ocean

More Telugu News