రైలు పట్టాలపై పడుకుని రీల్.. యూపీలో యువకుడి పిచ్చి చేష్ట

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రీల్..
  • మరుసటి రోజే ఇంటికి వెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
  • పట్టాల పక్కన ప్రమాదకరంగా రీల్స్ చేయొద్దంటూ హెచ్చరికలు
రీల్స్ పిచ్చిలో ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు.. పట్టాలపై పడుకుని తన పైనుంచి వెళుతున్న రైలును రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ప్రమాదకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోలీసుల దాకా చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. రీల్ తీసిన మరునాడే యువకుడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

మౌ జిల్లాకు చెందిన అజయ్ రాజ్‌ బర్ ఇన్ స్టాగ్రామ్ లో కామెడీ, ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. తన ఫాలోవర్లను థ్రిల్ చేయడం కోసం ఇటీవల పట్టాలపై వెళుతున్న రైలును వీడియో తీశాడు. రైలు వస్తుండగా పట్టాల మధ్యలో పడుకుని మొబైల్ తో షూట్ చేశాడు. రైలు వెళ్ళిపోయే వరకు అలాగే పడుకొని ఉన్నాడు.

ఆపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ ఎవరూ చేయొద్దంటూ అజయ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అజయ్ రాజ్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఒడిశాలో అక్టోబర్ 21 న ఇలాగే పట్టాలపై రీల్స్ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని రైలు ఢీ కొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


More Telugu News