Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ 'వాటర్ టెస్ట్' సక్సెస్.. గంటకు 180 కి.మీ. వేగంతో ట్రయల్ రన్

Vande Bharat Sleeper Water Test Successful at 180 kmph
  • వందేభారత్ స్లీపర్ రైలు వాటర్ టెస్ట్ వీడియో షేర్ చేసిన మంత్రి అశ్విని వైష్ణవ్
  • కోటా నుంచి నాగ్డా సెక్షన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగు
  • టేబుల్ పై ఉంచిన నీటి గ్లాసులు కదలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం
  • రాత్రిపూట ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేయనున్న వందేభారత్ స్లీపర్
  • త్వరలోనే అందుబాటులోకి రానున్న అత్యాధునిక వందేభారత్ స్లీపర్ సేవలు
భారతీయ రైల్వే ప్రయాణికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వందేభారత్ స్లీపర్' రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య జరిగిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది.

ఈ సందర్భంగా రైలు స్థిరత్వాన్ని (Stability) పరీక్షించేందుకు అధికారులు వినూత్నంగా 'వాటర్ టెస్ట్' నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నా, లోపల టేబుల్ మీద పిరమిడ్ ఆకారంలో ఒకదానిపై ఒకటి పేర్చిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద ప‌డ‌లేదు. వీడియోలో మొబైల్ స్పీడోమీటర్ పై 182 కిలోమీటర్ల వేగం కనిపిస్తున్నప్పటికీ, రైలు ఏమాత్రం కుదుపులకు లోనుకాకుండా సాఫీగా ప్రయాణించిందని, ఇది ఈ కొత్త తరం రైలు సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని మంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లు సెమీ-హైస్పీడ్ చైర్ కార్ సేవలను మాత్రమే అందిస్తున్నాయి. అయితే దూర ప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారి కోసం అత్యాధునిక హంగులతో ఈ స్లీపర్ వెర్షన్ ను రైల్వే శాఖ రూపొందించింది. రానున్న రోజుల్లో ఏసీ క్లాస్ ప్రయాణికులకు విమాన తరహా ప్రయాణ అనుభూతిని, సౌకర్యాన్ని ఈ రైళ్లు అందించనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే రద్దీగా ఉండే రూట్లలో దూర ప్రాంతాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.
Vande Bharat Sleeper
Indian Railways
Ashwini Vaishnaw
Kota Nagda section
Water Test
Trial Run
High Speed Rail
Sleeper Train
Railway Safety
Semi High Speed

More Telugu News