Damien Martyn: కోమాలోకి వెళ్లిన ఆసీస్ దిగ్గజ బ్యాటర్.. పరిస్థితి విషమం

Australia Great Damien Martyn Who Played 208 ODIs In Induced Coma After Serious Illness
  • బ్రిస్బేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డెమియన్ మార్టిన్
  • మెనింజైటిస్ సోకడంతో కోమాలోకి వెళ్లిన మాజీ క్రికెటర్
  • మార్టిన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న సహచర ఆటగాళ్లు
  • 2003 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మార్టిన్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించిన డెమియన్ మార్టిన్ (54) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. మెనింజైటిస్ (మెదడు వాపు వ్యాధి) సోకడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన కోమాలో ఉన్నారని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మార్టిన్ అస్వస్థత వార్త తెలిసి క్రికెట్ లోకం షాక్‌కు గురైంది. ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ సహచర ఆటగాళ్లు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. "మార్టిన్‌కు సాధ్యమైనంత ఉత్తమ వైద్యం అందుతోంది. ప్రజల ప్రార్థనలు, శుభాకాంక్షలు ఆయన కుటుంబానికి ధైర్యాన్నిస్తున్నాయి" అని మార్టిన్ సన్నిహితుడు, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ కూడా మార్టిన్ అనారోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆసీస్ తరఫున మార్టిన్ క్రికెట్ కెరీర్ ఇలా..
ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడిన మార్టిన్.. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్‌గా సేవలందించాడు. టెస్టుల్లో 46.37 సగటుతో 13 సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా 1999, 2003 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్లలో ఆయన సభ్యుడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై విరిగిన వేలితోనే బ్యాటింగ్ చేసి అజేయంగా 88 పరుగులు సాధించిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్, ఆ తర్వాత కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
Damien Martyn
Damien Martin health
Damien Martin Meningitis
Australian Cricketer
Adam Gilchrist
Cricket Australia
2003 World Cup
Australia Cricket
cricket news
sports news

More Telugu News