Uttarakhand Train Collision: ఉత్తరాఖండ్‌లో సొరంగంలో ఢీకొన్న రెండు లోకోమోటివ్ రైళ్లు

Uttarakhand Train Collision Two Locomotives Collide in Tunnel
  • విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఘటన
  • కార్మికుల రైలు, మెటీరియల్ రైలు ఢీకొనడంతో ప్రమాదం
  • ప్రమాద సమయంలో రైల్లో 109 మంది
  • 60 మందికి గాయాలు
నూతన సంవత్సర వేళ ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. టి.హెచ్.డి.సి నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్‌కోటి సొరంగంలో మంగళవారం అర్ధరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీకొన్నాయి. షిఫ్ట్ మారుతున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకువెళ్తున్న రైలు.. మెటీరియల్‌తో వస్తున్న మరో రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

లోకోమోటివ్ రైళ్లు ఢీకొన్న సమయంలో కార్మికుల రైల్లో మొత్తం 109 మంది ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘర్షణతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చీకటిగా ఉండే సొరంగం లోపల ఈ ప్రమాదం జరగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 60 మందికి గాయాలు కాగా, వారిలో 10 మందిని గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి, మరో 17 మందిని పీపల్‌కోటిలోని వివేకానంద ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు.

సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా పొడవైన సొరంగాల్లో కార్మికులను, మెటీరియల్‌ను చేరవేయడానికి ఇలాంటి లోకోమోటివ్ రైళ్లను ఒకే ట్రాక్‌పై ఉపయోగిస్తుంటారు. అయితే, సిగ్నలింగ్ లోపమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్యంతో ఈ విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Uttarakhand Train Collision
Chamoli district
Vishnugad Pipalkoti Hydroelectric Project
Tunnel accident
THDC
Gaurav Kumar
Alaknanda River
Train accident India

More Telugu News