Rashmika Mandanna: ఈ తొమ్మిదేళ్లలో నేను గర్వపడే అంశం ఇదే: రష్మిక

Rashmika Mandanna Proud of Fans After 9 Years in Film
  • సినీ పరిశ్రమలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న రష్మిక మందన్న
  • తొలి సినిమా కిరిక్ పార్టీ నుంచి సాగిన ప్రయాణం
  • అభిమానుల ప్రేమే తనను నిలబెట్టిందంటూ ఎమోషనల్ పోస్ట్
  • మీరు కేవలం ప్రేక్షకులు కాదు నా కుటుంబ సభ్యులంటూ కామెంట్స్
  • భవిష్యత్తులోనూ ఇలాగే ఆదరించాలంటూ రష్మిక విజ్ఞప్తి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ పరిశ్రమలో అడుగుపెట్టి విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ తొమ్మిదేళ్ల మైలురాయిని పురస్కరించుకుని అభిమానులు ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిన రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

"తొమ్మిదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు 26 సినిమాల్లో నటించాను. అయితే నా సినిమాల కంటే.. ఈ ప్రయాణంలో నేను సంపాదించుకున్న నా 'ఫ్యామిలీ' (అభిమానులు)ని చూసి ఎక్కువగా గర్వపడుతున్నాను. మీ ప్రేమ, నమ్మకం, ఓర్పు.. చిన్న చిన్న క్షణాలు, పెద్ద విజయాలు.. ఈ తొమ్మిదేళ్లలోని ప్రతి విషయం నా గుండెను నింపేశాయి. సంతోషం, గర్వం, కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది" అని రష్మిక పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు, మెసేజ్‌లు, ట్వీట్లు చదువుతుంటే తనకెంతో ఆనందంగా ఉందని రష్మిక తెలిపారు. "మీ మెసేజ్‌లు నా మోముపై చిరునవ్వును తెప్పించాయి. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తోంది. నా ప్రతి గెలుపులో, ఓటమిలో, సందేహాల్లో.. ప్రతి దశలోనూ నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు.

అసలు ఈ తొమ్మిదేళ్లు ఇండస్ట్రీలో ఎలా నెట్టుకురాగలిగానో తనకే తెలియదని, కేవలం అభిమానుల వల్లే ఇది సాధ్యమైందని 'పుష్ప' నటి చెప్పుకొచ్చారు. తాను ఎలా ఉన్నానో అలా అంగీకరించి, ఇంత గొప్పగా ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

"మన మధ్య ఉన్న బంధం నటి-ప్రేక్షకుడు అనే స్థాయిని దాటి ఎప్పుడో కుటుంబ బంధంగా మారిపోయింది. అది నాకు ఎంతో విలువైనది. మిమ్మల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటాను" అని రష్మిక ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులోనూ మరింత కష్టపడి, మంచి సినిమాలు చేసి అభిమానులు గర్వపడేలా చేస్తానని రష్మిక మాటిచ్చారు. ఎల్లప్పుడూ మీ ప్రేమ, మద్దతు తనకు కావాలని కోరుతూ.. "ఎప్పటికీ మీ రష్మిక" అంటూ తన నోట్‌ను ముగించారు.
Rashmika Mandanna
Rashmika
Kirik Party
Indian actress
Tollywood
Bollywood
Pushpa
National Crush
South Indian cinema
actress

More Telugu News