Meta Platforms: ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కొత్తతరం ఏఐ ఏజెంట్స్... సింగపూర్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న మెటా

Meta Acquires Manus AI Startup for Facebook Whatsapp Integration
  • ఏఐ స్టార్టప్ మానుస్‌ను కొనుగోలు చేసిన టెక్ దిగ్గజం మెటా
  • 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన డీల్ అని అంచనా
  • గూగుల్, ఓపెన్ఏఐకి పోటీ ఇచ్చేందుకు మెటా వ్యూహాత్మక అడుగు
  • తనంతట తానుగా పనిచేసే ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేసిన మానుస్ 
  • ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఈ టెక్నాలజీని విలీనం చేయనున్న మెటా
  • మెటా వైస్ ప్రెసిడెంట్‌గా చేరనున్న మానుస్ సీఈఓ షావో హాంగ్
టెక్నాలజీ రంగంలో మరో భారీ ఒప్పందం కుదిరింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ 'మానుస్' (Manus)ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్ విలువ 2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,600 కోట్లు) పైగానే ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కొనుగోలుతో ఏఐ రంగంలో గూగుల్, ఓపెన్ఏఐ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది.

చైనాకు చెందిన వ్యవస్థాపకులు ప్రారంభించిన మానుస్, ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది సాధారణ ఏఐ చాట్‌బాట్‌ల లాంటిది కాదు. వినియోగదారుల సూచనలకు స్పందించడమే కాకుండా, తనంతట తానుగా క్లిష్టమైన పనులను పూర్తిచేసే "జనరల్ పర్పస్ అటానమస్ ఏఐ ఏజెంట్ల"ను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందింది. మార్కెట్ రీసెర్చ్, డేటా విశ్లేషణ, కోడింగ్, ట్రిప్ ప్లానింగ్ వంటి పనులను ఇది మానవ ప్రమేయం లేకుండానే చేయగలదు.

ఈ అత్యాధునిక టెక్నాలజీని తమ ఉత్పత్తుల్లో విలీనం చేయడమే లక్ష్యంగా ఈ కొనుగోలు జరిపినట్లు మెటా ఒక ప్రకటనలో తెలిపింది. "ఏఐ ఏజెంట్లు తదుపరి అతిపెద్ద టెక్నాలజీ మార్పును సూచిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కేవలం సూచనలకు స్పందించడమే కాకుండా, వినియోగదారుల తరఫున పనులు కూడా చేస్తుంది. ఈ దిశగా మా దీర్ఘకాలిక వ్యూహానికి మానుస్ బృందం పనితీరు సరిగ్గా సరిపోతుంది" అని మెటా వివరించింది. భవిష్యత్తులో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలోని 'మెటా ఏఐ' అసిస్టెంట్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు.

ఈ ఒప్పందంపై మానుస్ సీఈఓ షావో హాంగ్ కూడా స్పందించారు. "మెటాతో కలవడం మా పనికి దక్కిన గొప్ప గుర్తింపు. మానుస్ పనితీరులో ఎలాంటి మార్పు లేకుండా, మరింత బలమైన పునాదిపై భవిష్యత్తును నిర్మించుకుంటాం" అని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ డీల్ ప్రకారం, షావో హాంగ్ మెటాలో వైస్ ప్రెసిడెంట్‌గా చేరనున్నారు.

2022లో ప్రారంభమైన మానుస్, కేవలం 8 నెలల్లోనే 100 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. కొనుగోలు తర్వాత కూడా మానుస్ సేవలను ప్రత్యేకంగా కొనసాగిస్తామని, అదే సమయంలో తమ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ టెక్నాలజీని విలీనం చేస్తామని మెటా స్పష్టం చేసింది. వాట్సాప్ కొనుగోలు తర్వాత మెటా చరిత్రలో ఇది మూడో అతిపెద్ద డీల్‌గా నిలవడం గమనార్హం.

Meta Platforms
Facebook
Whatsapp
Manus AI
Artificial Intelligence
AI Startup Acquisition
Shaohong
Singapore Startup
Meta AI Assistant
Technology Deal

More Telugu News