‘ఏంటి బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’.. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ విడుదల.. మీరూ చూసేయండి

  • చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం
  • కీలక పాత్రలో నటించిన వెంకటేశ్
  • జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అరుదైన కలయికతో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘మెగా విక్టరీ మాస్’ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.


ఈ పాట లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేశ్ లు స్టైలిష్ పబ్ సెట్టింగ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టారు. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ స్క్రీన్‌ను షేక్ చేయడం ఫ్యాన్స్‌కు అసలైన విజువల్ ట్రీట్‌గా మారింది. తొలిసారి ఈ మెగా–విక్టరీ కాంబినేషన్ ఇలా ఎనర్జిటిక్‌గా కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. చిరంజీవి మాస్ ఆరా, వెంకటేశ్ స్టైల్ రెండూ కలిసి పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ‘మెగా విక్టరీ మాస్’ పాటకు కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ మరింత హుషారును జోడించాయి. ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ సాగే పదాలు పండగ మూడ్‌ను పూర్తిగా క్యాప్చర్ చేశాయి. సంగీతం, లిరిక్స్, డ్యాన్స్ అన్నీ కలిసి ఈ పాటను ఫుల్ మాస్ ఫీస్ట్‌గా మార్చాయి.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా కనిపించనున్నారు. విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుండటం మరో హైలైట్. 


షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. మెగా–విక్టరీ మాస్ జోష్‌తో ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.



More Telugu News