BR Naidu: అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

Vaikunta Ekadasi Celebrations at Tirumala Temple
  • శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు
  • ధనుర్మాస కైంకర్యాల అనంతరం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వార దర్శనాలు షురూ
  • వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్న తెలంగాణ సీఎం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 గంటలకు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు అనుమతినిచ్చారు.

ముందుగా ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ... "అనుకున్న సమయం కంటే ముందుగానే భక్తుల కోసం దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం" అని వెల్లడించారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా నడిచి స్వామివారి ఆశీస్సులు పొందారు. సీఎం రేవంత్‌కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు కొనసాగుతాయి. తొలి మూడు రోజులు కేవలం టోకెన్లు ఉన్నవారికే అనుమతి ఉంటుందని, జనవరి 2 నుంచి సాధారణ భక్తులకు కూడా అవకాశం కల్పిస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డూ ప్రసాదం, అన్నదానం, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
BR Naidu
TTD
Tirumala
Vaikunta Ekadasi
Vaikunta Dwara Darshanam
Revanth Reddy
Tirumala Temple
Andhra Pradesh Temples
Hindu Festival
TTD Chairman

More Telugu News