ATMs: దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య.. ఆ ఒక్క కారణంతో వేలాదిగా మూసివేత

ATM numbers decline in FY25 as digital payments rise says RBI banking report
  • డిజిటల్ చెల్లింపుల పెరుగుదలే ప్రధాన కారణం
  • ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ ఏటీఎంలలోనే ఎక్కువ కోత
  • ఏటీఎంలు తగ్గినా కొత్తగా పెరిగిన బ్యాంక్ బ్రాంచులు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరగడంతో ఏటీఎంల (ATMs) అవసరం క్రమంగా తగ్గుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య భారీగా తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్' నివేదికలో వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రజలు మొగ్గుచూపుతుండటంతో బ్యాంకులు ఏటీఎంల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2024 మార్చి నాటికి 2,53,417గా ఉన్న ఏటీఎంల సంఖ్య.. 2025 మార్చి 31 నాటికి 2,51,057కు పడిపోయింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌ను భారీగా కుదించుకున్నాయి. గత ఏడాది 79,884గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలు, ఈ ఏడాది 77,117కు తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఈ సంఖ్య 1,34,694 నుంచి 1,33,544కు స్వల్పంగా తగ్గింది. ఆఫ్-సైట్ ఏటీఎంల మూసివేత ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

అయితే, బ్యాంకేతర సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంల (White Label ATMs) సంఖ్య మాత్రం 34,602 నుంచి 36,216కు పెరగడం విశేషం. ఇక ఏటీఎంల విస్తరణ విషయంలో.. ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా సేవలు అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, బ్యాంక్ బ్రాంచుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 2025 మార్చి నాటికి దేశంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 1.64 లక్షలకు చేరింది. కొత్త బ్రాంచుల ఏర్పాటులో ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే దూకుడుగా ఉన్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.
ATMs
RBI
Reserve Bank of India
Digital Payments
Bank Branches
White Label ATMs
ATM closures
Online Transactions
Banking Sector
Financial Year 2025

More Telugu News