TGSRTC: సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లేవారికి శుభవార్త.. ఏపీకి ప్రత్యేక బస్సులు

TGSRTC Announces Sankranti Special Buses to Andhra Pradesh
  • సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీకి ప్రత్యేక బస్సులు
  • బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఆంధ్రాలోని ప్రధాన నగరాలకు సర్వీసులు
  • జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్న బస్సులు
  • ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించిన ఆర్టీసీ
  • సమాచారం కోసం 9959226149 నంబరును సంప్రదించాలని సూచన
తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను ప్రకటించింది.

బీహెచ్‌ఈఎల్‌ డిపో (ఆర్సీపురం) నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా వెళ‌తాయి. ఇవి ప్రధానంగా విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రద్దీని బట్టి అదనపు బస్సులను పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు 9959226149 నెంబరును సంప్రదించవచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు విమాన చార్జీలతో పోటీపడుతున్న తరుణంలో ఆర్టీసీ కల్పిస్తున్న ఈ తక్కువ ధర సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
 
TGSRTC
Sankranti special buses
Telangana RTC
AP special buses
Hyderabad to Andhra Pradesh
Vijayawada buses
Guntur buses
BHEL Miyapur
RTC online booking

More Telugu News